దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా చరిత్ర సృష్టించింది. ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డును ‘ఆర్ఆర్ఆర్’ సొంతం చేసుకుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కలసి డాన్స్ ఇరగదీసిన ‘నాటు నాటు’ సాంగ్.. ఒరిజినల్ సాంగ్ విభాగంలో బెస్ట్ సాంగ్‌గా ఎంపికైంది. అతిరథ మహారథుల మధ్య ఈ అవార్డును సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అందుకున్నారు. ప్రముఖ రచయిత చంద్రబోస్ ఈ పాటకు సాహిత్యం అందించారు. ఈ మాస్ సాంగ్‌లో ఎన్టీఆర్, రామ్‌చరణ్ వేసిన స్టెప్పులు ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకుల చేత ఈలలు వేయించాయి.
చప్పట్లు కొడుతూ సందడి చేసిన ఆర్.ఆర్.ఆర్.
బుధవారం కాలిఫోర్నియాలోని ది బెవర్లీ హిల్టన్ హాల్ వేదికగా గోల్డెన్ గ్లోబ్ అవార్డులు-2023 కార్యక్రమం జరుగుతోంది. ఈ సందర్భంగా RRR మూవీ రెండు నామినేషన్లతో ఈ అవార్డుల్లో చోటు సంపాదించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ మూవీ కేటగిరీల్లో ఈ మూవీ నామినేట్ కాగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డును కైవసం చేసుకుంది. ఈ అవార్డుల ప్రదానోత్సవంలో రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్, కీరవాణి కుటుంబసమేతంగా పాల్గొని సందడి చేశారు. ‘నాటు నాటు’కు పురస్కారం ప్రకటించిన సమయంలో తారక్, రాజమౌళి, చరణ్.. చప్పట్లు కొడుతూ సందడి చేశారు. కీరవాణి ఈ అవార్డును అందుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ అవుతూ టాలీవుడ్ ప్రేక్షకులకు అంతులేని ఆనందాన్నిస్తున్నాయి.
Here's the moment that "Naatu Naatu" won the #GoldenGlobe for Best Original Song – Motion Picture.https://t.co/IpBnF0ZqEp pic.twitter.com/zSDO8KLQlx
— Variety (@Variety) January 11, 2023
రాజమౌళికే ఈ అవార్డు దక్కాలి..
గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు ఎంఎం కీరవాణి అన్నారు. ప్రతిష్ఠాత్మక అవార్డు ఇచ్చిన హెచ్ఎఫ్పీఏకు ధన్యవాదాలు తెలిపారు. తన సోదరుడు రాజమౌళికి ఈ అవార్డు దక్కాలని చెప్పారు. పాటలో భాగమైన రాహుల్ సిప్లిగంజ్‌కు ధన్యవాదాలు తెలిపారు. పాటకు తన కొడుకు కాలభైరవ అద్భుత సహకారం అందిచారన్నారు. తన శ్రమను, తనకు మద్దతు ఇచ్చిన వారిని నమ్ముకున్నానని చెబుతూ.. సంతోష సమయాన్ని తన భార్యతో పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు.
చరిత్ర సృష్టించిన తెలుగు సినిమా
కాగా, మొదటిసారిగా ఒక భారతీయ సినిమాకు అందులోనూ ఓ తెలుగు సినిమాకు ఈ అవార్డు దక్కడం విశేషం. ఈ కేటగిరిలో మరో 4 మంది నామినీలపై గట్టి పోటీనే ఎదుర్కొని ఈ అవార్డ్‌ని కైవసం చేసుకుంది. ఈ పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ సాధించడం, భవిష్యత్తులో మరిన్ని భారతీయ చిత్రాలకు మార్గం సుగమం చేస్తుందనే చెప్పాలి. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా.. ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నది. ఆస్కార్ బరిలో కూడా దూసుకుపోతున్న విషయం తెలిసిందే.