బంగారు పులి మన దేశంలోనే..  - MicTv.in - Telugu News
mictv telugu

బంగారు పులి మన దేశంలోనే.. 

July 13, 2020

రాజసానికి నిదర్శనం పులి. పులి ఎంత క్రూరమృగమైనా దానిలో గొప్ప ఆకర్షణ ఉంటుంది. పదునైన చూపులతో, పెద్దపెద్ద పంజాలతో మహారాజులా నడుస్తుంటే అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది. పులుల్లో చాలా రకాలు ఉన్నాయి. పులి అనగానే అందరికీ చటుక్కున పెద్దపులే గుర్తుకొస్తుంది. చిరుతపులులు, చీతాలు, జాగ్వార్లు, పాంథర్లు.. మరెన్నో రకాలు ఉన్నాయి. అయినా చారల పెద్దపులి అంటేనే చాలామంది ఇష్టం. 

పెద్దపులుల్లోనూ చాలా రకాలు ఉన్నాయి. తెల్లపులులు మన హైదరాబాద్ జూ పార్కులోనూ ఉన్నాయి. తాజాగా మన దేశంలో మరో అద్భుతమై పులి కనిపించింది. బంగారంలా మెరిసే స్ట్రాబెర్రీ టైగర్ అస్సాంలోని కజిరంగ అభయాణ్యంలో కెమెరా కంటికి చిక్కింది. దీని చర్మం లేత ఎరుపు రంగులో మెరిస్తూ ఉంటుంది కనుక దీన్ని గోల్డెన్ టైగర్ అని, ట్యాబీ టైగర్ అని అంటారు. అవి అత్యంత అరుదైన పులులు. మనదేశంలో సమీప గతంలో ఇలాంటివి కనిపించలేదు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటివి 30 మాత్రమే ఉన్నాయి. 

మనదేశంలో 21వ శతాబ్దిలో బంగారుపులి కనిపించడం ఇదే తొలిసారి. మయూరేశ్ హెంద్రే అనే ఫొటోగ్రాఫర్ ఈ పులిని కెమెరాలో బంధించాడు. దీన్ని దర్జాకు నెటిజన్లు సలాం కొడుతున్నారు. జన్యువుల్లో మార్పుల వల్ల ఇలాంటి రంగురంగుల పులులు పుడుతుంటాయి. ఇటీవల ఒడిశా అడవుల్లో ఒళ్లంతా బొగ్గు పూసుకున్నట్లు ఉండే బ్లాక్ టైగర్లు కూడా కనిపించాడు. వీటి ముఖం, కాళ్లు పచ్చగా, మిగతా భాగం పెద్దపెద్ద నల్లచారికలతో ఉంటుంది. 

చివరగా మనం చూడకున్నా మనందరికీ తెలిసిన బంగారు జింకను గుర్తుచేసుకుందాం. రామాయణంలో కనిపించే ఆ మాయలేడి ఎంతటి దారుణాలకు కారణమైందో తెలిసిందే. మనదేశం అడవుల్లో బంగారంలా మెరిసే జింకలతోపాటు, కోతులు, పక్షులు, పాములు కూడా చాలానే ఉన్నాయి. సృష్టిలో ఎన్ని వింతలో కదా.