టాలీవుడ్‌లో విషాదం..గొల్లపూడి మారుతీరావు కన్నుమూత - MicTv.in - Telugu News
mictv telugu

టాలీవుడ్‌లో విషాదం..గొల్లపూడి మారుతీరావు కన్నుమూత

December 12, 2019

Gollapudi Maruthi Rao No More

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు(80) కన్నుమూశారు. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు.  

చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గొల్లపూడి మరణంపై టాలీవుడ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. సీనియర్ నటుడిని కోల్పోవడం బాధగా ఉందని పలువురు వ్యాఖ్యానించారు. ఆయన కుటుంబానికి పలువురు సంతాపం ప్రకటించారు. 

మారుతీరావు మైలురాళ్లు ఎన్నో : 

1939 ఏప్రిల్ 14న విజయనగరంలో ఆయన జన్మించారు. గొల్లపూడి కేవలం నటుడుగానే కాకుండా ఎన్నో ప్రతిభలు కలిగి ఉన్నారు. ఆయన ఆంధ్ర ప్రభ పత్రిక ఉప సంపాదకుడిగా పనిచేశారు. వ్యాఖ్యాతగా, రచయితగా పేరు తెచ్చుకున్నారు. వివిధ తెలుగు దినపత్రికల్లో ఆయన కాలమ్స్ కూడా రాశారు. జీవన కాలం పేరుతో ఆయన కాలమ్స్ చాలా ప్రాచుర్యం పొందాయి. తెలుగులో సాహిత్యాభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారు.ఎన్నో కథలు,నవలలు కూడా ఆయన రచించారు. సాహిత్య రంగంలో ఆయన పరిశోధనలు ఎన్నో తెలుగు విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశంగా విద్యార్థులకు ఉపయోగపడుతున్నాయి. 

 

13 ఏళ్లకే మారుతీరావు ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగం సంపాధించారు. 14 ఏళ్లకే ‘ఆశా జీవి’ కథను రాసిన గొల్లపూడి ఎంతో పేరు తెచ్చుకున్నారు. సినీ రంగంలోకి వచ్చి 250కి పైగా చిత్రాల్లో ఆయన నటించారు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో ఆయన వెండి తెరకు పరిచయం అయ్యారు. మొత్తం ఆరు నంది పురస్కారాలను అందుకున్నారు. కే. విశ్వనాథ్ తొలి చిత్రం ‘ఆత్మ గౌరవం’ సినిమాకు రచయిత కూడా గొల్లపూడి మారుతి రావే.