శరీరంలో ఏ అవయవం దెబ్బతిన్నా దాని ప్లేస్లో వేరే అవయవాన్ని మార్చే అవకాశం వుంది. తల విషయంలో అలాంటి అవకాశం వుండదు. కానీ పూణెకు చెందిన డాక్టర్లు మాత్రం నాలుగేళ్ళ బాలిక పుర్రెను విజయవంతంగా మర్చారు. దీంతో ఆ పాపకు పునర్జన్మ ఎత్తినంతపనైంది. ఇది భారత వైద్య చరిత్రలోనే అద్భుతం అని చెప్పొచ్చు.గత సంవత్సరం మే 31న జరిగిన యాక్సిడెంట్లో పాప పుర్రె తీవ్రంగా దెబ్బతింది. అపస్మారక స్థితిలో ఆమెను తమ ఆసుపత్రికి తీసుకువచ్చారని, తొలుత ఆమెను వెంటిలేటర్ సపోర్టుతో బతికించి, సీటీ స్కాన్ చేసి చూస్తే, పుర్రె చితికిందన్న విషయం తెలిసిందని డాక్టర్ అన్నారు. అప్పుడు పాపకు రెండు సర్జరీలు చేశారు. పాప బతికి బట్టకట్టినా సమస్య మళ్ళీ తిరగదోడింది. బాలిక పుర్రెలో సమస్య నెలకొన్న కారణంగా 60 శాతం భాగాన్ని తిరిగి చేర్చాలని వైద్యులు నిర్ణయించారు.
అమెరికాకు చెందిన సంస్థ, పాప పుర్రెకు సంబంధించిన కొలతలు తీసుకుని, పాలీ ఎథిలిన్ బోన్తో త్రీ డైమెన్షనల్ రూపంలో దాన్ని తయారు చేసింది. దీన్ని వైద్యులు విజయవంతంగా ఆమెకు అమర్చారు. ఇండియాలో స్కల్ ఇంప్లాంట్ సర్జరీ విజయవంతం కావడం ఇదే తొలిసారి. ఇప్పుడు తమ బిడ్డ స్కూలుకు వెళుతోందని, చక్కగా ఆడుకుంటూ ఆనందంగా ఉందని పాప తల్లి ఆనందం వ్యక్తం చేసింది.