తల్లిదండ్రులందరూ వారి పిల్లలను చాలా ప్రేమగా, అపురూపంగా పెంచాలని తాపత్రయపడతారు. అదే సమయంలో వారు జీవితంలో సరైన మార్గంలో వెళ్ళాలని కూడా కోరుకుంటారు. ఈ క్రమంలో తెలియకుండానే పిల్లలను కొన్ని విషయాల్లో బాగా గారాబం చేయడం లేదా కొన్ని విషయాలలో మరింత కఠినంగా ప్రవర్తించడం చేస్తారు. ఇలాంటి పరిస్థితుల రాకుండా పిల్లలు క్రమశిక్షణతో పాటు చదువులో కూడా ఉన్నతమైన స్థానానికి చేరేలా తయారు చేసేందుకు ప్రయత్నించాలి. లేకపోతే పిల్లలు తల్లిదండ్రుల మాట లెక్కచేయడం మానేసి వారికి నచ్చినరీతిలో వారు ఉంటారు. అంతేకాకుండా వారికి ఉండే చిన్న చిన్న ఇబ్బందులను కూడా మనతో షేర్ చేసుకోవడం తగ్గించి వారికి వారే సొంత నిర్ణయాలు తీసుకొని పెడదారిన పడే అవకాశం కూడా లేకపోలేదు. అందుకే పిల్లలను ఎలా పెంచాలో అనే విషయం గురించి తెలుసుకుందాం.
పాజిటివిటీ పెంపొందించడం..
మొదటగా పిల్లల్లో పాజిటివిటీ పెంచాలి.చదువులో గాని, ఆటల్లో గాని వారికి కావాల్సిన ప్రేరణను మనం వారికి అందించాలి. తద్వారా వారిలో ఏదైనా సాధించగలం అనే పాజిటివిటీ పెరుగుతుంది. ఇది వారు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరేందుకు చాలా ముఖ్యం. ప్రతీ విషయానికి వాళ్ళ మీద చిరాకు పడడం కూడా అంత మంచిది కాదు. ఇది వారు చెడు మార్గం వైపు వెళ్ళేందుకు దోహదపడుతుంది.
సహాయపడే గుణం..
పిల్లలకు చిన్నప్పటి నుండి సహాయపడే గుణాన్ని అలవాటు చేయాలి. చిన్నతనం నుండి వారిలో స్వార్ధాన్ని నూరిపోయకూడదు. ఇతర అవసరలకు స్పందించేలా వారిని ప్రోత్సహించాలి. అందువలన వారు అందరితో కలివిడిగా ఉంటూ స్నేహపూరిత వాతావరణాన్ని అలవాటు చేసుకుంటారు. తద్వారా వారు ఒంటరిగా ఉన్నామనే భావనను కోల్పోయి ఉత్సాహంగా ఉంటారు. పిల్లలు ఇతరులకు సహాయడపే కార్యక్రమాల్లో పాల్గొనేలా వారిని అలవాటు చేయాలి. వారిలో ఏదో సాధించాలనే ఆశయంతో పాటు ఇతరులకు సహాయపడాలనే తపన కూడా ఉండేలా వారిని ప్రోత్సహించాలి. దీనివలన వారిలో లీడర్షిప్ క్వాలిటీస్ కూడా పెరుగుతాయి.
పిల్లలపై అనవసరంగా కోపగించుకోవడం :
మనం కొన్ని సందర్భాల్లో పిల్లలపై తెలియకుండానే కోపానికి లోనవుతాం. ఉదాహరణకు వారు మన కళ్ళ ముందే ఏదైనా గోడ ఎక్కడం లేదా ప్రమాదకర వస్తువులతో ఆడుకోవడం వంటివి చేసినప్పుడు మనం పట్టరాని కోపం వస్తుంది. అయితే ఇలాంటి సందర్భాలలో మనం కొంచెం నిగ్రహంగా ఉంటూ వారిని దగ్గరకు తీసుకొని అలా చేయకూడదని నెమ్మదిగా చెప్పాలి. దాని వలన జరిగే అనర్ధాలను వారికి వివరించాలి. మనం ఎంత ఎక్కువ వారి మీద కోపం పెంచుకుంటే వారు అంత మొండిగా తయారయ్యే ప్రమాదం ఉంది. వారి అలవాటును మనం వ్యతిరేకించడం వారు సహించలేరు. అందుకే ముందుగా వారితో మంచిగా మాట్లాడి వారిని మచ్చిక చేసుకోవాలి.
పిల్లలను ఇంట్లో చిన్న చిన్న బాధ్యతలు అప్పగించడం :
పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు మనందరం ఎక్కువగా వారు చదువుకోవాలని కోరుకుంటాం. ఎంత చదివితే అంత ప్రయోజనం అని భావిస్తాం. అయితే పిల్లలకు చదువుతోపాటు ఇంట్లో చిన్న చిన్న బాధ్యతలను కూడా అప్పజెప్పాలి. దీనివలన వారిలో కృషి, పట్టుదల పెరిగి సంఘంలో ఎలా నడుచుకోవాలో చిన్నప్పటి నుండే తెలుస్తుంది. రోజూ మన ఇంటిలో ఉండే కొన్ని బాధ్యతలను వారు క్రమం తప్పకుండా నిర్వర్తించేలా వారిని ప్రేరేపించాలి.
పిల్లలకు మన జీవిత భాగస్వామితో బలమైన బంధాన్ని ఏర్పరచడం :
భార్యభర్తల మధ్య సఖ్యతలేని పిల్లలకంటే అన్యూన్యంగా ఉండే భార్యభర్తలు పిల్లలు జీవితంలో విజయం సాధిస్తారని చాలా అధ్యయనలు తెలుపుతున్నాయి. భార్యభర్తల సఖ్యతగా ఉండడం అనేది కూడా పిల్లల ఎదుగుదలకు దోహదపడుతుంది. చాలామంది పిల్లలు అయితే అమ్మతోనో లేదా నాన్నతో మాత్రమే చనువుగా ఉంటారు. ఇంకొకరితో పెద్దగా మాట్లాడరు. వారికి సంబంధించిన ఏ విషయం కూడా షేర్ చేసుకోరు. ఇలా కాకుండా ఇద్దరితో సమానంగా వారి అభిప్రాయాలను పంచుకునేలా వారికి తెలియజేయాలి. వారికి జీవితంలో ఎటువంటి ప్రమాదం వచ్చిన వారు తల్లిదండ్రులు ఇద్దరి దగ్గర వారి కష్టాన్ని చెప్పుకునేలా చిన్నప్పటి నుండి వారిని ప్రోత్సహించాలి.
సవాళ్ళను అధిగమించే గుణాన్ని అలవాటు చేయడం
పిల్లలు ఏదైనా సాధించాలనే గుణాన్ని వారికి చిన్నప్పటి నుండి నేర్పించాలి. వారు ఎప్పుడు ఏదైనా ఒక గోల్ పెట్టకొని దాని మీద ఫోకస్ చేసేలా వారికి తర్ఫీదు ఇవ్వాలి. ఎటువంటి సావాళ్లనైనా వారు భయపడకుండా ధైర్యంగా స్వీకరించేలా వారికి ప్రోత్సహించాలి. వారి ఏ పనినైనా కష్టంతోకాకుండా ఇష్టంగా చేయడం నేర్పాలి. ఇది వారిలో పోరాట పటిమను పెంపొందించి జీవితంలో ఏదైనా సాధించాలనే తపనను వారిలో చిన్నపటి నుండి బలంగా నాటుతుంది.
స్ట్రెస్ మేనేజ్మెంట్
మనలో చాలామంది మన దైనందిక జీవితంలో ఉండే ఒత్తిడి ప్రభావాన్ని మన కుటుంబసభ్యులపై లేదా పిల్లలపై చూపిస్తుంటాం. ఇది పిల్లలలో మన పట్ల నెగిటివిటీని పెంచుతుంది. వారు క్రమక్రమంగా మనల్ని శత్రవుల్లా చూడటం ప్రారంభిస్తారు. అందుకోసమే మన ఒత్తిడిని, కోపాన్ని వారి మీద చూపించకూడదు. మనం మన పనిలో ఎంత ఒత్తిడిలో ఉన్నా వారిని మాత్రం ప్రేమగానే దగ్గరకు తీసుకొని మాట్లాడం అలవరచుకోవాలి. ఇలా చేయడం వలన వారు మనపై ఉండే భయాన్ని కోల్పోయి ప్రతీ విషయాన్ని మనతో షేర్ చేసుకోవడం అలవాటు చేసుకుంటారు.