ముంబైని వరించిన అదృష్టం.. దేనికైనా కలిసి రావాలి - MicTv.in - Telugu News
mictv telugu

ముంబైని వరించిన అదృష్టం.. దేనికైనా కలిసి రావాలి

May 7, 2022

ఐపీఎల్ 15వ సీజన్ మ్యాచ్‌లు మొదటి రోజు నుంచి నేటీవరకు ఉత్కంఠగా జరుగుతున్నాయి. మ్యాచ్ గెలవదు అని నిరాశ చెందుతున్న సమయంలో యువ బ్యాటర్లు, యువ బౌలర్లు రెచ్చిపోయి, తమ ప్రదర్శనతో అభిమానులను ఆనందంలో ముంచెత్తున్నారు. శుక్రవారం ముంబై, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. వరుస పరాజయాలతో నిరాశలో ఉన్న ముంబైని అదృష్టం వరించింది. ముంబై ఖాతాలో మరో విజయం చేరింది. గుజరాత్ టైటాన్స్‌తో ఐదు పరుగుల తేడాతో విజయం సాధించి, రెండో విజయాన్ని సొంతం చేసుకుంది.

 

తొలుత బ్యాటింగు చేసిన ముంబై.. 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (45), రోహిత్ శర్మ (43), సూర్యకుమార్ యాదవ్ (13), తిలక్ వర్మ (21), పొలార్డ్ (4) స్వల్ప స్కోర్లకే అవుటైనా, చివర్లో టిమ్ డేవిడ్ చెలరేగడంతో భారీ స్కోరు సాధ్యమైంది. 21 బంతులు ఆడిన డేవిడ్ 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 44 పరుగులు చేశాడు.

అనంతరం బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్.. సాహా 55, శుభమన్ గిల్ 52, కెప్టెన్ పాండ్యా 24, సాయి సుదర్శన్ 14, డేవిడ్ మిల్లర్ 19 (నాటౌట్) పరుగులు చేశారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 172 పరుగులు చేసింది. అయితే, చివరి ఓవర్ వరకు గుజరాత్ టైటాన్స్ గెలుస్తుందని అభిమానులంతా ఫిక్స్ అయ్యారు. కానీ, ఆఖరి ఓవర్‌లో ముంబై బౌలర్ మ్యాజిక్ చేసి, అభిమానులను ఆశ్చర్యపరిచాడు. క్రీజులో డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా ఉన్నప్పటికీ శామ్స్ బంతులను ఎదుర్కొని 9 పరుగులు సాధించలేకపోయారు. విజయం ముంగిట ఒక్కసారిగా బోల్తాపడ్డారు. మ్యాచ్‌ను వీక్షించిన గుజరాత్ టైటాన్స్ అభిమానులు ‘ముంబై జట్టుకు అదృష్టం తన్నుకుంటూ వచ్చింది. దేనికైనా కలిసి రావాలి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.