Good news America.. Green card for 80 lakh people
mictv telugu

గుడ్‌న్యూస్ చెప్పిన అమెరికా..80 లక్షల గ్రీన్‌కార్డులు

September 30, 2022

అమెరికా దేశంలో ఉద్యోగాల రీత్యా ఆయా దేశాల నుంచి వలస వెళ్లి, కొన్ని ఏడేండ్లుగా అక్కడే స్థిరపడి, గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి అమెరికా ప్రభుత్వం ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. అతి త్వరలోనే దాదాపు 80 లక్షల మంది వలసదారులకు గ్రీన్ కార్డులను మంజూరు చేసేందుకు కసరత్తులు చేస్తున్నామని ప్రకటించింది. ఇందులో భాగంగా శాశ్వత నివాస హోదాను కల్పించే, కార్డు మంజూరు విషయంలో తాజాగా డెమోక్రాటిక్ పార్టీకి చెందిన నలుగురు సభ్యుల బృందం బిల్లును సెనేట్‌‌లో ప్రవేశపెట్టింది.

”అమెరికాలో వరుసగా కనీసం ఏడేళ్లపాటు నివాసం ఉన్న వలసదారు చట్టబద్ధమైన శాశ్వత నివాస అర్హత పొందవచ్చు. గతంలో సవరించిన ఇమిగ్రేషన్ విధానం ఎందరికో ఇబ్బందికరంగా మారింది. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది. మా బిల్లులో గత 35 ఏళ్లలోనే మొదటిసారిగా రిజిస్ట్రీ కటాఫ్ తేదీని సవరించాం. దీనితో మరింతమంది వలసదారులు చట్టబద్ద శాశ్వత నివాస హోదా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాదు, దశాబ్దాలుగా ఇక్కడే నివాసం ఉండి పనులు చేసుకుంటూ అభివృద్ధిలో వారి వంతు తోడ్పాటునందిస్తున్న లక్షలాది మంది వలసదారులు అనిశ్చితితో భయపడాల్సిన అవసరం లేకుండా ఇకపై స్వేచ్చగా జీవించవచ్చు’ ” అని సెనేటర్ డిల్లా తెలియజేశారు.

అయితే, ఈ బిల్లు కార్యరూపం దాలిస్తే గనుక..డ్రీమర్లు, లాంగ్ టర్మ్ వీసాదారుల సంతానం, అత్యవసర సిబ్బంది, హెచ్-1బీ వీసాలు కలిగిన అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగులు తదితర 80 లక్షల మందికి ప్రయోజనం ఉంటుంది. చట్టపరమైన అడ్డంకి వల్ల వలసదారులు గ్రీన్‌కార్డుకు నోచుకోలేకపోతున్నారు అని వలసదారుల తరఫున పనిచేసే ఎడబ్ల్యూడీ డాట్ యుఎస్ అంచనా వేసింది. ఈ పరిణామాన్ని ఆశావహులు సైతం
స్వాగతించారు.