Good news..Applications for five fellowships have started
mictv telugu

గుడ్‌న్యూస్..5 ఫెలోషిప్‌లకు దరఖాస్తులు ప్రారంభం

September 7, 2022

Good news..Applications for five fellowships have started

దేశవ్యాప్తంగా ఆయా విశ్వవిద్యాలయల్లో పరిశోధన చేస్తున్న విద్యార్ధినీ, విద్యార్ధులకు, అధ్యాపకులకు, రిటైర్డ్ ఫ్యాకల్టీలకు కేంద్ర ప్రభుత్వం ఓ శుభవార్తను చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫెలోషిప్‌లకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) పచ్చజెండా ఊపింది. మొత్తం 5 రకాల ఫెలోషిప్‌లకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను  ఆహ్వానిస్తున్నామని తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది.

”డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్ యూజీసీ పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్, డాక్టర్ డీఎస్ కొఠారి రిసెర్చ్ గ్రాంట్ ఫర్ న్యూలీ రిక్రూటెడ్ ఫ్యాకల్టీ, రిసెర్చ్ గ్రాంట్ ఫర్ ఇన్ సర్వీస్ ఫ్యాకల్టీ మెంబర్స్, ఎమిట్రస్ ఫెలోషిప్, సావిత్రిబాయి జ్యోతిబా ఫూలే ఫెలోషిప్ ఆఫ్ సింగిల్ గర్ల్ చైల్డ్ ఫెలోషిప్‌లకు దరఖాస్తులు ప్రారంభమైయ్యాయి. అర్హులైన వారు అక్టోబర్ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం ఐదు రకాల ఫెలోషిప్‌లు ఉన్నాయి. పూర్తి వివరాలకు www.ugc.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించండి” అని యూజీసీ అధికారులు తెలియజేశారు.

ఆ 5 ఫెలోషిప్‌ల వివరాలు ఇవే..

1. ఇన్ సర్వీస్ ఫ్యాకల్టీ రీసెర్చ్ గ్రాంట్..
ఈ స్కీమ్ ద్వారా ఫ్యాకల్టీ మెంబర్లుగా అపాయింట్ అయిన వారికి పరిశోధనలపై అవకాశం కల్పిస్తూ, 200 మందిని ఎంపిక చేస్తారు. రెండేళ్లపాటు రూ.10 లక్షల ఫెలోషిప్ ఇస్తారు.

2. డాక్టర్ డీఎస్ కొఠారీ రీసెర్చ్ గ్రాంట్..
కొత్తగా రిక్రూట్ చేయబడిన సైన్స్, మెడిసిన్, ఇంజినీరింగ్ విభాగాలకు చెందిన ఫ్యాకల్టీలకు పరిశోధనకు అవకాశం కల్పిస్తూ, 132 మంది ఎంపిక చేస్తారు. రెండేళ్లపాటు రూ.10 లక్షల ఫెలోషిప్ ఇస్తారు.

3. ఫెలోషిప్ ఫర్ సూపర్‌యాన్యుయేటెడ్ ఫ్యాకల్టీ మెంబర్స్..
పదవీ విరమణ చేసిన తర్వాత కూడా బోధనలో, పరిశోధనలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న ఉపాధ్యాయులకు పరిశోధన అవకాశాలను కల్పిస్తూ, 100 మందిని ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.50 వేలు, ఏడాదికి రూ.50 వేల చొప్పున మూడేళ్లు అందిస్తారు.

4. డాక్టర్ రాధాకృష్ణన్ యూజీసీ పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్..
ఈ స్కీమ్ కింద 900 మంది అభ్యర్థులకు భారతీయ విశ్వవిద్యాలయాలు, సంస్థలలోని భాషలతో సహా సైన్సెస్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్‌లో అధునాతన అధ్యయనాలు, పరిశోధనలను నిర్వహించడానికి అవకాశాన్ని అందిస్తుంది. అయితే, ఇందులో 30 శాతం మహిళా అభ్యర్థులకు మాత్రమే రిజర్వ్ చేసి ఉంచింది. ఈ ఫెలోషిప్‌నకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.50వేలు, ఏడాదికి రూ.50 వేల చొప్పున మూడేళ్లు అందిస్తారు.

5. సింగిల్ గర్ల్ చైల్డ్‌ కోసం సావిత్రిబాయి జోతిరావ్ ఫూలే ఫెలోషిప్..
ఈ ఫెలో షిప్ ఎంతమందికి అందించాలనే నిబంధన ఏమీ లేదు. సింగిల్ గర్ల్స్‌ను ఎంకరేజ్ చేయడానికి యూజీసీ ఈ స్కీం ప్రవేశ పెట్టింది. వారు తమ చదువులు, పరిశోధనలు కొనసాగించి అంతిమంగా అవి వారి పీహెచ్‌డీకి ఉపయోగపడేలా చేస్తుంది.