Good news..APS RTC reduced bus fares
mictv telugu

గుడ్‌న్యూస్..బస్సు ఛార్జీలను తగ్గించిన ఏపీఎస్ ఆర్టీసీ

September 2, 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం కాసేపటిక్రితమే ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. ఏసీ బస్సు ఛార్జీలను తగ్గిస్తూ, ఓ ప్రకటన విడుదల చేసింది. తగ్గించిన బస్సు ఛార్జీల్లో ఏకంగా 20శాతం వరకు తగ్గించినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే, తగ్గించిన ఈ ఛార్జీలు తాత్కాలికంగా ఈ నెల 30వరకు మాత్రమే అమల్లో ఉంటాయని తెలిపారు. ఇందులోనూ శుక్రవారం, ఆదివారం మినహా మిగతా రోజుల్లో మాత్రమే ఛార్జీలు తగ్గిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రూట్లు, ఛార్జీలు ఎంత తగ్గించాలనే నిర్ణయాన్ని రీజినల్ మేనేజర్లకు అప్పగించామని, ఛార్జీల తగ్గింపుపై జిల్లాల ఆర్టీసీ అధికారులు ప్రకటనలు జారీ చేస్తారని తెలిపారు.

ఈ క్రమంలో ఆయా జిల్లాల్లో ఉన్న ఆర్టీసీ అధికారులు ఛార్జీల తగ్గింపుపై ప్రకటనలు విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగా విజయవాడ-హైదరాబాద్ మార్గంలో ఎక్కువగా తిరిగే అమరావతి, గరుడ, వెన్నెల ఏసీ బస్సుల్లో టికెట్ ధరలో 10 శాతం మేర తగ్గించినట్టు అధికారులు వెల్లడించారు. విజయవాడ, విశాఖ డాల్ఫిన్ క్రూజ్, విజయవాడ నుంచి చెన్నై, బెంగళూరు వెళ్లే వాటిలో 20 శాతం మేర ఛార్జీ తగ్గించినట్లు తెలిపారు. శుక్రవారం, ఆదివారం మినహా మిగతా రోజుల్లో మాత్రమే ఈ ఛార్జీల తగ్గింపు వర్తిస్తుందని ఆర్టీసీ స్పష్టం చేసింది.

బస్సుల్లో తగ్గించిన చార్జీలు ఇవే..

1. అమరావతి, గరుడ, వెన్నెల బస్సు చార్జీల్లో 10 శాతం తగ్గింపు
2. విజయవాడ-విశాఖ డాల్ఫిన్‌ క్రూజ్‌ బస్సుల్లో 20 శాతం తగ్గింపు
3. హైదరాబాద్‌-విజయవాడ ఏసీ బస్సుల్లో 10 శాతం తగ్గింపు
4. విజయవాడ నుంచి చెన్నై, బెంగళూరు బస్సుల్లో 20 శాతం తగ్గింపు.