హైదరాబాద్‌లో తెల్లవారుజాము 4 వరకు బస్సులు - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో తెల్లవారుజాము 4 వరకు బస్సులు

May 14, 2022

హైదరాబాద్‌ వాసులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. సిటీ బస్సుల విషయంలో అధికారులు కీలక ప్రకటన చేశారు. ఇక నుంచి హైదరాబాద్‌లోని పలు మార్గాల్లో అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు నైట్ బస్సులు నడుస్తాయి అని తెలిపారు. 24 గంటలపాటు సిటీ బస్సులను నడపాలని టీఎస్ ఆర్టీసీ నిర్ణయించిందని, ప్రయాణికులు ఈ సర్వీసులను వినియోగించుకోవాలని కోరారు.

”సిటీ బస్సులు ఇక నుంచి 24 గంటలపాటు అందుబాటులో ఉంటాయి. సాధారణంగా అర్దరాత్రి 12 గంటలకే సిటీ సర్వీసులు నిలిచిపోతాయి. ఆ తర్వాత బస్సులు రోడ్లపై కనపడవు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని, అర్ధరాత్రి 12 తర్వాత కూడా సిటీ బస్సులు నడపేలా నిర్ణయించాం. ఇప్పటికే పలు మార్గాల్లో అర్ధరాత్రి 12 నుంచి పొద్దున్న 4 వరకు బస్సులను నడుపుతున్నాం. దానికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. అందుకే మరిన్ని మార్గాల్లో నైట్ బస్సులను నడపాలని ఈ నిర్ణయం తీసుకున్నాం” అని ఉన్నతాధికారులు తెలిపారు.

నైట్ బస్సులు నడిచే ప్రాంతాలు…

”సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వివిధ మార్గాల్లో నైట్ బస్సులు నడుస్తాయి. ఈ బస్సులు ఉదయం 3.30 గంటలకు బయలుదేరుతాయి. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఆస్టల్‌గంజ్, మెహిదీపట్నం, బోరబండ ప్రాంతాలకు వెళ్తాయి. ప్రతి అరగంట నుంచి 45 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది. సికింద్రాబాద్ చిలకలగూడ క్రాస్ రోడ్డు నుంచి హయత్ నగర్ వరకు మరో రెండు బస్సులు నడుస్తున్నాయి. చిలకలగూడ నుంచి ఇబ్రహీంపట్నం వరకు, మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ నుంచి లింగంపల్లి వరకు ఈ నైట్ బస్సులు అందుబాటులో ఉంటాయి.”