Good news..cooking oil prices have come down..here is the rate table
mictv telugu

గుడ్‌న్యూస్..వంట నూనెల ధరలు తగ్గాయ్..ఇదిగో రేట్ల పట్టిక

July 19, 2022

దేశ ప్రజలకు వంట నూనెను తయారు చేసే సంస్థలు గుడ్‌న్యూస్ చెప్పాయి. గతవారం కేంద్ర ప్రభుత్వ అధికారులు వంటనూనెల ధరలపై ఆయా యాజమాన్యాలతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. చర్చల్లో భాగంగా పామాయిల్, సన్‌ప్లవర్ వంటనూనెలపై కనీసం రూ.10 నుంచి రూ. 15 తగ్గించాలని కోరారు. దాంతో ఆయా వంటనూనెల తయారీదారులు కచ్చితంగా తగ్గిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారమే.. వంటనూనెలపై తాజాగా తగ్గించిన కొత్త ధరల పట్టికను విడుదల చేశారు.

దీంతో ప్రస్తుతం మార్కెట్లో వంట నూనెల తయారీ, విక్రయ సంస్థలు ఎంఆర్పీ రేటు ప్రకారమే విక్రయిస్తున్నారు. కొన్నిచోట్ల నూనె ప్యాకెట్లపై ముద్రించి ఉండే ధరతో పోలిస్తే, దుకాణాల్లో తక్కువకే విక్రయిస్తుంటారు. ఇక, రైతు బజార్లతోపాటు దిగ్గజ సూపర్ మార్కెట్లు, బ్రాండెడ్ అవుట్లలో ధరలను పరిశీలించి, కొనుగోలు చేసుకుంటే మేలు కలుగుతుందని నిపుణులు తెలిపారు. సవరించిన ధరలతో నూనె ప్యాకెట్లు విపణిలోకి వస్తున్నాయి. ఫార్చూన్ బ్రాండ్‌పై ఉత్పత్తులు విక్రయించే అదానీ విల్మర్.. గరిష్ఠ విక్రయ ధరను లీటరుకు రూ. 30 వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. మిగిలిన సంస్థలు కూడా ఇలానే ఎంఆర్పీలను సవరించాయి.

”ధారా బ్రాండ్ కింద వంట నూనెలు విక్రయిస్తున్న మదర్ డెయిరీ ఈనెల 7న సోయాబీన్, రైస్ బ్రాన్ నూనెలపై లీటరుకు రూ.14 వరకు ధరలు తగ్గించింది. ప్రియ ఫుడ్స్ సంస్థ హైదరాబాద్‌లోని బ్రాండెడ్ విక్రయశాలల్లో రైరిచ్ లీటరు రూ.172, సన్‌ఫ్లవర్ రూ. 176, పామాయిల్ రూ. 127, వేరుసెనగ నూనె రూ.170 చొప్పున విక్రయిస్తోంది. ఫ్రీడం ఆయిల్ రెండు నెలల క్రితం లీటరు సన్‌ఫ్లవర్ ఆయిల్ గరిష్ట విక్రయ ధర రూ. 220 కాగా, ఇప్పుడు రూ. 192కు చేరింది. వివిధ విక్రయశాలల్లో ఇంత కంటే తక్కువే లభిస్తున్నాయి” అని సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పి. చంద్రశేఖరరెడ్డి తెలిపారు