Good news for 11,103 employees..The first proposal is complete
mictv telugu

11,103 మంది ఉద్యోగులకు గుడ్‌న్యూస్..తొలి ప్రతిపాదన పూర్తి

September 2, 2022

తెలంగాణ రాష్ట్రంలో ఆయా ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న 11,103 మందిని త్వరలోనే పర్మిమెంట్ ఉద్యోగులుగా చేస్తామని కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఆరోజు నుంచి ఆయా శాఖల్లో కొన్ని సంవత్సరాలుగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న వారు ఎప్పుడెప్పుడు పర్మిమెంట్ ఉద్యోగులుగా ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేస్తుందని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో సీఎం కార్యాలయం గుడ్‌న్యూస్ చెప్పింది. కొలువుల క్రమబద్ధీకరణ తొలి ప్రతిపాదన పూర్తి అయిందని పేర్కొంది. కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన వెంటనే..ఆయా శాఖలవారీగా ప్రతిపాదనలు సమర్పించాలని, వివిధ శాఖలను ఆదేశించామని, క్రమబద్ధీకరణ నిబంధనలకు అనుగుణంగా వర్క్‌ హిస్టరీ ఉన్న ఉద్యోగులను గుర్తించి, ఆయా శాఖలు ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదనలు సమర్పించాయని సీఎం కార్యాలయం అధికారులు తెలిపారు.

”రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ 143 మంది కాంట్రాక్టు సూపర్‌వైజర్ల జాబితాతో తొలి ప్రతిపాదన సమర్పించగా, సీఎం కార్యాలయం దాన్ని ఆమోదించింది. అందుకు అనుగుణంగా రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్‌ ఉద్యోగులకు శాశ్వత ప్రాతిపదికన పోస్టింగ్‌లు, కొత్త స్థానాలకు బదిలీ చేస్తూ, నియామక ఉత్తర్వులు జారీ చేసింది. విధుల్లో చేరిన ఆయా ఉద్యోగులకు కేడర్‌ ఆధారిత పే స్కేల్‌కు అనుగుణంగా వచ్చే నెల (అక్టోబర్‌)లో తొలి వేతనం అందనుంది” అని అధికారులు తెలిపారు.

మరోపక్క ప్రస్తుతం కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు సంబంధించి విద్య, అనుబంధ శాఖల్లోనే దాదాపు 32 శాతం మంది ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గురుకుల సొసైటీలు, ఉన్నత, సాంకేతిక విద్యాశాఖల్లోనే అత్యధిక పోస్టులున్నాయని, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించినప్పటికీ, సర్వీసు నిబంధనల విషయంలో స్పష్టత కోసం ఆయా ఫైళ్లకు మోక్షం కలగలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో నెలాఖరులోగా మరికొన్ని ఫైళ్లకు ఆమోదం లభిస్తుందని సీఎం కార్యాలయం అధికారులు వెల్లడించారు.