ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. నాడు-నేడు కింద 468 జూనియర్ కళాశాలల్లో పనులు నిర్వహించాలని, ప్రతి మండలానికీ రెండు జూనియర్ కళాశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలని బుధవారం అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా వాటిలో అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఓ కాలేజీనే ఏర్పాటు చేయాలని జగన్ నిర్ణయించారు. అందుకు సంబంధించిన కార్యాచరణను అధికారులు వెంటనే తయారు చేయాలని కోరారు. దీంతో ఈ కాలేజీల ఏర్పాటుకు దాదాపుగా రూ. 960 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అధికారులు జగన్కు వివరించారు.
ఈ నేపథ్యంలో నూతన విద్యా విధానానికి అనుగుణంగా స్కూళ్ల మ్యాపింగ్ పూర్తి చేశామని, విడతల వారీగా ఆరు కేటగిరీల స్కూళ్లను ప్రారంభిస్తామని వారు తెలిపారు. అనంతరం జగన్ మాట్లాడుతూ..”సీబీఎస్ఈ అఫిలియేషన్తో ఉండాలి. దశలవారీగా స్కూళ్లు ఏర్పాటు కావాలి. వాటికి అనుగుణంగా సబ్జెక్టుల టీచర్లను పెట్టే కార్యక్రమం కూడా చేపట్టండి. జులై 2024 నాటికి సబ్జెక్టుల వారీగా టీచర్లను పెట్టే కార్యక్రమాన్ని పూర్తి చేయండి” అని జగన్ అన్నారు. ఇప్పటివరకూ 1,310 స్కూళ్లకు సీబీఎస్ఈ అఫిలియేషన్ చేయించామని అధికారులు వివరించారు. జగనన్న గోరుముద్ద, సంపూర్ణ పోషణలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని జగన్ అధికారులను ఆదేశించారు.