ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు గ్రామ, వార్డు సచివాలయాలు శుభవార్తను చెప్పాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇక నుంచి సచివాలయాల్లోనే ఆధార్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ప్రకటన విడుదల చేశాయి. ఎవరైతే తొలిసారిగా ఆధార్ వివరాలను నమోదు చేసుకుంటారో,వారికి ఎటువంటి రుసుము లేకుండా ఉచితంగా సేవలు అందజేస్తామని పేర్కొన్నాయి. ఐదేళ్ల నుంచి 15 ఏళ్ల మధ్య పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకునే వారికి కూడా ఒకసారి ఉచితంగా సేవలు అందజేసేలా గ్రామ, వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ షాన్మోహన్ అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
డైరెక్టర్ షాన్మోహన్ తెలిపిన వివరాల ప్రకారం..’ఆధార్ కలర్ ప్రింట్, బయోమెట్రిక్‌లో తప్పులు సరిదిద్దడం. అడ్రసు వివరాల్లో మార్పులకు ఆధార్ నమోదు సంస్థ నిర్ధారించిన సర్వీసు మాత్రమే చార్జి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల సచివాలయాల్లో ఈ ఆధార్ సేవా కేంద్రాలను కొత్తగా ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఐదు సచివాలయాల్లో ఒకటి చొప్పున, సాధ్యమైనంత వరకు అన్ని గ్రామాలు, వార్డుల వారికి సమాన దూరంలో ఉండేలా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నాం. ఆధార్ సేవల కోసమే ప్రత్యేకంగా ల్యాప్‌టాప్, మానిటర్, కెమెరా, మల్టీ ఫంక్షనల్, ఐరిస్, ఫింగర్ ప్రింట్ డివైస్, వైట్ స్క్రీన్, ఫోకస్ లైట్, జీపీఎస్ డివైస్, ప్రొటెక్టర్, వీజీఏ టూ హెచ్డీఎంఐ కన్వర్టర్ సహా మొత్తం 15 రకాల ఎలక్ట్రానిక్ పరికరాలతో కూడిన కిట్‌ను ప్రభుత్వం ఆయా సచివాలయాలకు సరఫరా చేస్తోంది” అని ఆమె తెలిపింది.
ఇప్పటికే రెండు దశల్లో మొత్తం 1,100 సచివాలయాలకు ఆ కిట్లను కూడా అందజేశామని, మిగిలిన చోట్లకి సరఫరా ప్రక్రియ కొనసాగుతున్నట్టు అధికారులు వెల్లడించారు. కిట్లు అందుకున్న సచివాలయాల్లో ఇప్పటికే ఆధార్ సేవలు కూడా ప్రారంభమయ్యాయని అన్నారు. ఆధార్ సేవలు నిర్వహణకు సంబంధించి సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.