ఏపీ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏడు నూతన ఈఎస్ఐ ఆసుపత్రులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. సోమవారం పార్లమెంట్లో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించగా, ఈ విషయాన్ని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో భాగంగా విశాఖలో రూ.384.26 కోట్లతో సీపీడబ్ల్యూడీ శాఖతో, విజయనగరంలో రూ.73.68 కోట్ల కేంద్ర నిధులతో మేకన్ కంపెనీ ఆధ్వర్యంలో, కాకినాడలో రూ.102.77 కోట్ల కేంద్ర నిధుల కేటాయింపుతో సీపీడబ్ల్యూడీ శాఖ సహకారంతో కొత్తగా ఈఎస్ఐ ఆసుపత్రుల నిర్మాణం జరుగుతుందని కేంద్రం పేర్కొంది.
అంతేకాకుండా గుంటూరు, పెనుకొండ, విశాఖ, అచ్యుతాపురం, నెల్లూరు శ్రీ సిటీలకు నూతన ఈఎస్ఐ ఆసుపత్రులు మంజూరు చేశామని.. అవి ప్రస్తుతం భూసేకరణ దశలో ఉన్నాయని కేంద్రం తెలిపింది. వీటితోపాటు రాజమండ్రి, విశాఖలోని మల్కీపురంలో ఈఎస్ఐ ఆసుపత్రులు పుననిర్మాణంలో ఉన్నాయని, విజయవాడలో కూడా సీపీడబ్ల్యూడీ శాఖకు ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం బాధ్యతలను అప్పగించారని కేంద్రం ప్రభుత్వం తెలిపింది.
మరోపక్క కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఏపీకి రాజధాని అమరావతే అంటూ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అమరావతి పేరుతో నిధులు కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్లో నూతన ఈఎస్ఐ ఆసుపత్రులను మంజూరు చేయడంపై ఎంపీ నరసింహారావు స్పందిస్తూ.. ఆరోగ్య వసతుల లేమితో బాధపడుతున్న ఏపీ ప్రజలకు కేంద్రం మంజూరు చేసిన ఈఎస్ఐ ఆస్పత్రుల వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. అందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఆయన అన్నారు.