ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. వెయిటేజీ తొలగింపు - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. వెయిటేజీ తొలగింపు

May 18, 2022

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యా మండలి విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఇక నుంచి నిర్వహించబోయే ఇంజినీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ కోర్సుల ప్రవేశాల ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీసెట్)లో ఇంటర్ మార్కుల వెయిటేజీని తొలగిస్తూ, నిర్ణయం తీసుకుంది. ఈఏపీసెట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగానే ర్యాంకులు ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా కారణంగా మొదటి సంవత్సరం ( ప్రస్తుతం రెండవ సంవత్సరం) చదువుతున్న విద్యార్థులకు పరీక్షలను మార్చిలో నిర్వహించకుండా, విద్యార్థులందరిని పాస్ చేశారు. ఇంకా ఎవరైనా ఎక్కువ మార్కులు కావాలనుకుంటే సప్లిమెంటరీ పరీక్షలు రాసుకోవాలని అధికారులు సూచించారు.

అధికారులు మాట్లాడుతూ..” విద్యార్ధులు చాలా మంది సప్లిమెంటరీ పరీక్షలు రాశారు. ఇంకా ఎవరైనా రాయనివారు ఉంటే నష్టపోతారనే ఉద్దేశంతో ఇంటర్ మార్కులను వెయిటేజీని తొలగించాం. ఈఏపీసెట్‌ను 100 మార్కులకు నిర్వహిస్తాం. కరోనా కారణంగా 30శాతం సిలబస్‌ను తగ్గించిన కారణంగా ప్రవేశ పరీక్షలో ఆ సిలబస్‌ నుంచి ప్రశ్నలు ఇవ్వరు.” అని తెలిపారు.

ఈ క్రమంలో ఇంటర్ విద్యామండలి మరో నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జూనియర్ కళాశాలలను జూన్ 20న తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మొదటి ఏడాది ప్రవేశాలను ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. అన్నీ సక్రమంగా జరిగితే, ప్రవేశాలను జూన్‌లోపు పూర్తి చేసి, మొదటి సంవత్సరం వారికి జులై ఒకటి నుంచి తరగతులు ప్రారంభించాలని భావిస్తోంది.

ఇక, జూన్ 10వ తారీఖు లోపు పదోవ తరగతి ఫలితాలను ఇవ్వనున్నారు. మూల్యాంకనం ఈ నెల చివరి నాటికి పూర్తి చేయనున్నారు. మూల్యాంకనం అనంతరం ఇతర కార్యకలాపాలను ఐదు, ఆరు రోజుల్లో పూర్తిచేసి, ఫలితాలు విడుదల చేయాలని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయించింది.