ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే టెట్.. - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే టెట్..

June 2, 2022

ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు జగన్ సర్కార్ త్వరలోనే గుడ్‌న్యూస్ చెప్పనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ టీచర్‌ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మరికొన్ని రోజుల్లో ఓ తీపికబురుతో ముందుకొస్తున్నట్లు పేర్కొంది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌ 2022) ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నాహాలు చేస్తోన్నట్లు ఏపీపీఎస్సీ అధికారులు తెలిపారు. పేపర్ల వారీగా, పరీక్షల తేదీలతో కూడిన పూర్తి నోటిఫికేషన్‌‌ను అతి త్వరలోనే విడుదల చేస్తామని బుధవారం ప్రకటించారు. టెట్‌‌ పరీక్షను రాసేందుకు అభ్యర్ధులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రకటనతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి.

ఏపీలో చాలా కాలంగా టెట్‌ నిర్వహించకపోవడంతో లక్షల మంది అభ్యర్థులు నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. టెట్‌‌లో వెయిటేజీ కల్పించడంతోపాటు బీఈడీ, ఎంఈడీ అభ్యర్థులను ఎస్‌ఏ పోస్టులకు అర్హులుగా ప్రకటించడంతో, గతంలో క్వాలిఫై అయిన వారు కూడా మరోసారి పరీక్షను రాసేందుకు సిద్ధమవుతున్నారు. టెట్‌ మార్కులకు డీఎస్సీలో 20 శాతం మేర వెయిటేజీ ఉన్నందున ఎక్కువ ప్రాధాన్యత ఏర్పడింది. టెట్‌ ఉత్తీర్ణత సర్టిఫికెట్‌ చెల్లుబాటు గతంలో ఏడేళ్లు మాత్రమే ఉండగా, గతేడాది ఎన్‌సీటీఈ సవరించి జీవితకాలం చెల్లుతుందని ప్రకటించింది.

టెట్‌ 2021 విధివిధానాలు, సిలబస్‌ను పాఠశాల విద్యాశాఖ గతంలో విడుదల చేసింది. సిలబస్‌ను https://aptet.apcfss.in వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. టెట్‌లో రెండు పేపర్లు (పేపర్‌ 1, పేపర్‌ 2) ఉంటాయి. వీటిని 1 ఏ, 1 బీ, 2 ఏ, 2 బీ అని నిర్వహిస్తారు. అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఎన్‌సీటీఈ మార్పులు చేయడంతో ప్రభుత్వం ఆ మేరకు సవరణలు చేసింది. గతంలో టెట్‌కు సంబంధించి జారీ చేసిన జీవో 23కు సవరణలు చేస్తూ జీవో 27 విడుదల చేసింది. దీని ప్రకారం అభ్యర్ధులకు మేలు చేకూరేలా టెట్‌ నోటిఫికేషన్లో పొందుపర్చనున్నారు.

ఇక, పరీక్ష విషయానికొస్తే, ఎవరెవరు ఏ పరీక్ష రాయాలి అనే విషయాన్ని అధికారులు వెల్లడించారు. ‘రెగ్యులర్‌ స్కూళ్లలో 1-5 తరగతుల్లో టీచర్‌ పోస్టులకు పేపర్‌ 1ఏలో అర్హత సాధించాలి. దివ్యాంగులు, ఇతర విభిన్న ప్రతిభావంతులు స్పెషల్‌ స్కూళ్లలో 1-5 తరగతులు బోధించాలంటే పేపర్‌ 1బీలో అర్హత తప్పనిసరి. రెగ్యులర్‌ స్కూళ్లలో 6-8, ఆ పై తరగతులు బోధించాలంటే పేపర్‌ 2ఏలో అర్హత సాధించాలి. స్పెషల్‌ స్కూళ్లలో ఇవే తరగతులకు పేపర్‌ 2బీలో అర్హత సాధించాల్సి ఉంటుంది.’