అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. టెట్ వ్యాలిడిటీ జీవితకాలం - MicTv.in - Telugu News
mictv telugu

అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. టెట్ వ్యాలిడిటీ జీవితకాలం

March 24, 2022

 

resave

తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ బుధవారం శుభవార్త తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 91 వేల ఉద్యోగాలను దశల వారీగా భర్తీ చేస్తామని కేసీఆర్ అసెంబ్లీలో మార్చి 9న అన్నారు. ఆ ప్రకారమే తొలి విడ‌త‌లో 30,453 ఉద్యోగాల భ‌ర్తీకి ఆర్థిక శాఖ నుంచి అనుమ‌తి వ‌చ్చేసింది. అయితే, ఉపాధ్యాయుల నియామకానికి ముందు నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను సాధ్యమైనంత త్వరగా నిర్వహించాలని విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలిని ఆదేశించారు.

ఈ క్రమంలో టెట్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన.. పరీక్ష నిర్వహణకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. 2015 డిసెంబరు 23న టెట్‌కు సంబంధించి జారీ చేసిన జీఓ 88లో ప్రధానంగా రెండు సవరణలు చేస్తూ ప్రభుత్వం తాజాగా జీఓ 8 ఇచ్చింది. విద్యాశాఖలో 18,086 కొలువులను భర్తీ చేస్తామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో 10 వేల వరకు ఉపాధ్యాయ కొలువులు ఉన్నాయి. అందులో ఎస్‌జిటీ కొలువులు 6,700 వరకు ఉన్నాయి. కాగా, మే నెలలోనే టెట్ నిర్వహించవచ్చని తెలుస్తోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టెట్ నిర్వహించడం ఇది మూడోసారి.

“ఇప్పటివరకు బీఈడీ అభ్యర్ధులు 6-10 తరగతులు బోధించేందుకు మాత్రమే అర్హులు. అందుకు టెట్లో పేపర్-2 రాసేవారు. ఇక నుంచి వారు 1-5 తరగతులకు బోధించేందుకు ఎన్డీటీలుగా నియమితులు కావొచ్చు. అంటే వారు టెలో పేపర్-1 రాయవచ్చు. కాకపోతే ఉద్యోగంలో చేరిన రెండేళ్లలోపు ప్రాథమిక విద్య బోధనలో ఆరు నెలల బ్రిడ్జి కోర్సు పూర్తి చేయాలి. ఇప్పటివరకు పేపర్-1కు కేవలం డీఈడీ వారు మాత్రమే అర్హులు.

ఒకసారి టెట్లో అర్హత సాధిస్తే ఆ ధ్రువపత్రానికి ఇప్పటివరకు ఏడేళ్ల కాలపరిమితి ఉండేది. ఆ తర్వాత దానికి విలువ ఉండదు. మళ్లీ టెట్ రాసుకోవాల్సిందే. అందుకు భిన్నంగా ఒకసారి టెలో అర్హత సాధిస్తే జీవితాంతం విలువ ఉండేలా మార్పు చేయాలని ఎన్‌సీటీఈ రెండేళ్ల క్రితమే నిర్ణయించింది. ఈ క్రమంలో విద్యాశాఖ ఆ ప్రకారం మార్పు చేసింది.