కాంట్రాక్ట్ లెక్చరర్లకు శుభవార్త..పిటిషన్ కొట్టివేత
తెలంగాణ రాష్ట్రంలో గతకొన్ని సంవత్సరాలుగా ఆయా కాలేజీల్లో కాంట్రాక్ట్ లెక్చరర్లుగా విధులు నిర్వహిస్తున్నవారికి కేసీఆర్ సర్కార్ ఓ శుభవార్తను చెప్పింది. క్రమబద్దీకరణలో కీలక ముందడుగు పడిందని పేర్కొంది. సుప్రీంకోర్టులో సోమవారం జరిగిన క్రమబద్దీకరణపై ప్రతిబంధంగా ఉన్న కేసును ధర్మాసనం కొట్టవేసిందని తెలియజేసింది. దీంతో ఇకపై రాష్ట్రంలో కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్దీకరణ సజావుగా సాగుతుందని ఉన్నతాధికారులు తెలియజేశారు.
గతంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం జీవో-16ను జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై హైకోర్టులో విచారణ జరుగగా, గత ఏడాది అన్ని పిటిషన్లను కొట్టివేసింది. అయితే, క్రమబద్దీకరణకు వ్యతిరేకంగా మహబూబ్ నగర్‌కు చెందిన ఓ వ్యక్తి సుప్రీంకోర్టులో 15637/22 స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఈఎస్ ఎల్పీని డిస్మస్ చేసింది. దీంతో కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్దీకరణకు మార్గం సుగమమైంది.
తాజాగా ఆయా కాలేజీల్లోని యాజమాన్యాలు..క్రమబద్దీకరణలో భాగంగా వొకేషనల్ అధ్యాపకుల జాబితాను రెడీ చేసి, ప్రభుత్వానికి పంపించారు. అందులో 360పైగా అర్హులైనవారితోపాటు ఇతరుల జాబితాలను పంపించారు. ఇతర రాష్ట్రాల్లో దూరవిద్య ద్వారా పీజీ పూర్తిచేసినవారు, ఉద్యోగంలో చేరేనాటికే వయోపరిమితి మించినవారు, ఉద్యోగంలో చేరేనాటికి పీజీ పూర్తిచేయకుండా తర్వాత పూర్తిచేసినవారు, ఇప్పటి వరకు సరైన అర్హతలు లేని వారి జాబితాలను వేర్వేరుగా రూపొందించి ప్రభుత్వానికి పంపించారు.
దీంతో పలు సంఘాల నాయకులు హర్షం వెలిబుచ్చారు. ఆర్రోడీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు గాదె వెంకన్న నేతృత్వంలో నాంపల్లిలోని ఇంటర్ విద్యా కమిషనరేట్ కార్యాలయంలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోదకుమార్‌కు ధన్యవాదాలు తెలిపారు.