Good news for film workers..Huge increase in wages
mictv telugu

సినీ కార్మికులకు గుడ్‌న్యూస్..భారీగా వేతనాలు పెంపు

September 15, 2022

తెలుగు చిత్రసీమ పరిశ్రమలో గతకొన్ని సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తూ, పరిశ్రమపైనే ఆధారపడి జీవిస్తున్న కార్మికులకు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి శుభవార్తను చెప్పింది. 30 శాతం వేతనాలు పెంచేందుకు నిర్మాతల మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు నెలలు క్రితం సినీ కార్మికుల వేతనాలను పెంచాలంటూ, పెద్ద ఎత్తున కార్మికులు ఆందోళన చేపట్టారు. ఆ క్రమంలో కార్మికులు పలు డిమాండ్లతో కూడిన ఓ వినతిపత్రాన్ని అందజేశారు. దానిపై సుదీర్ఘంగా చర్చోపచర్చలు జరిపిన నిర్మాతల మండలి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

”సినీ కార్మికుల వేతనాల పెంపుపై తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సానుకూలంగా స్పందించింది. కార్మికుల డిమాండ్ మేరకు 30 శాతం వేతనాలు పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. ఫిలిం ఫెడరేషన్ నాయకులతో జరిగిన చర్చలు సఫలం అయ్యాయి. ప్రతి మూడేళ్లకు ఒకసారి వేతనాలు పెంచాల్సి ఉండగా, కరోనా కారణంగా జాప్యం జరిగింది. దీంతో వేతనాలు సవరించి కార్మికులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, ఫిలిం ఫెడరేషన్ సెప్టెంబర్ 1న నిర్మాతల మండలికి నోటీసులు ఇచ్చింది. తమ డిమాండ్ నెరవేర్చకపోతే సెప్టెంబర్ 16న మరోసారి సమ్మెకు వెళతామని హెచ్చరించింది. ఈ విషయంపై సుదీర్ఘంగా చర్చలు జరిపి, 30 శాతం వేతనాలు పెంచాము” అని ఫిలిం ఫెడరేషన్‌ నాయకులు తెలియజేశారు.

అయితే, ఈ నిర్ణయంపై రేపు (సెప్టెంబర్ 15) అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఫిలిం ఫెడరేషన్‌ నాయకులు భావిస్తున్నారు. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో గ‌డ‌చిన 3 ఏళ్లుగా ప‌రిష్కారం కాని ఓ స‌మ‌స్య‌కు బుధ‌వారం ముగింపు ల‌భించడంతో కార్మికులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.