దేశవ్యాప్తంగా ఆయా ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు మోదీ ప్రభుత్వం బుధవారం శుభవార్త తెలిపింది. ఉద్యోగులకు,పెన్షనర్లకు (డీఆర్) 3 శాతం డీఏను పెంచుతూ ప్రకటన విడుదల చేసింది. ఇందుకు సంబంధించి, కేంద్ర ప్రభుత్వం కాసేపటి క్రితమే ట్విటర్ వేదికగా వెల్లడించింది. అంతేకాకుండా డీఏ బకాయిలను కూడా విడుదల చేయనున్నట్లుగా తెలిపింది.
అయితే, నేడు జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో మోదీ సర్కారు ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇక, పవర్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసే దిశగానూ కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే, మంత్రివర్గ ఆమోదంతో 31 శాతంగా ఉన్న డీఏ 34 శాతానికి పెరగనుంది.
మరోపక్క కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గతంలో ఇచ్చే కరువు భత్యం 31 శాతం కాగా, డీఏను 3 శాతం పెంచి 34 శాతానికి పెంచారు. ఈ నిర్ణయంతో దాదాపు 50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. గత ఏడాది అక్టోబర్‌లో చివరిసారిగా డీఏ పెంపును 28 శాతం నుంచి 31 శాతానికి పెంచారు. ప్రభుత్వం ఉద్యోగులకు 18వేలు డియర్నెస్ అలవెన్స్‌గా చెల్లిస్తుండగా, ఇప్పుడు కొత్తగా ప్రకటించిన డీఏ పెంపు ప్రకారం ఆ మొత్తాన్ని 24,000కు పెంచనున్నారు.