తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు త్వరలోనే కేసీఆర్ ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. ఇటీవలే గ్రూప్స్‌కు సంబంధించి ఇంటర్వ్యూలను ఎత్తివేస్తూ, నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పటివరకు అన్ని పేపర్లతోపాటు ఇంటర్వ్యూ మార్కులు కలిపి ఉండే గరిష్ట మార్కులనూ తగ్గించాలని భావిస్తోంది. ఈ నిర్ణయంతో ఇకనుంచి కేవలం రాతపరీక్షల మొత్తమే గరిష్ట మార్కులు కానున్నాయి.
ఈ క్రమంలో గ్రూప్ 1 పరీక్ష మొత్తంగా 900 మార్కులకు, గ్రూప్ 2 పరీక్ష మొత్తంగా 600 మార్కులకే ఉండనున్నాయి. ఈ మేరకు నియామక సంస్థలు పరీక్షా విధానానికి సంబంధించిన ప్రక్రియను దాదాపు కొలిక్కి తీసుకువచ్చాయి. గ్రూప్1, గ్రూప్ 2 కొలువులకు, వైద్యారోగ్య సంస్థల్లో మెడికల్ ఆఫీసర్, ఆపై స్థాయిలో నేరుగా చేపట్టే నియామకాలకు ఇంటర్వ్యూలు, గురుకుల విద్యా సంస్థల్లో బోధన పోస్టులకు సంబంధించి డెమో రౌండ్ ఇప్పటివరకు కీలకంగా ఉండేవి. నియామకాల్లో జాప్యాన్ని నివారించడం, అవకతవకలకు అవకాశం లేకుండా చేయడం కోసం వీటిని రద్దుచేసి, రాతపరీక్షల ఆధారంగానే నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దీంతో ఆయా ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష విధానంలో మార్పులపై నియామక సంస్థలు దృష్టి సారించాయి. ఇంటర్వ్యూలను రద్దు చేయడంతోపాటు వాటికి సంబంధించిన మార్కులను కూడా తొలగిస్తేనే మంచిదన్న ప్రతిపాదన చేశాయి. దీనిపై తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది.
మరోపక్క గ్రూప్ 1, గ్రూప్ 2 సిలబస్‌కు సంబంధించి ఎలాంటి మార్పులు లేనని వెల్లడించింది. ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూల రద్దుతో పరీక్ష విధానంలో మార్పులు అనివార్యమయ్యాయి. దీంతో పరీక్షల సిలబస్‌లో మార్పులు అవసరం లేదని నియామక సంస్థలు భావిస్తున్నాయి. అయితే ఇంటర్వ్యూలు తొలగించినందున.. ఆయా సామర్థ్యాలకు సంబంధించిన అంశాలను రాతపరీక్షలో చేర్చే ప్రతిపాదన కూడా ఉంది.