Good news for MBBS students
mictv telugu

ఎంబీబీఎస్ విద్యార్థులకు గుడ్‌న్యూస్

May 11, 2022

Good news for MBBS students

జాతీయ వైద్య కమిషన్ (ఎస్ఎంసీ) ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఇంటర్న్‌షిప్‌ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి విద్యార్థులు ఎక్కడ ఎంబీబీఎస్ పూర్తి చేస్తారో, అదే వైద్య కళాశాలకు చెందిన అనుబంధ బోధనాసుపత్రిలోనే ఇంటర్న్‌షిప్‌ను పూర్తి చేసేలా కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ నిబంధన ప్రకారం.. నవంబరు 2021 తర్వాత ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్ధులకు ఇది వర్తిస్తుందని ఎస్ఎంసీ పేర్కొంది. ఈ ప్రకారమే ఆయా కళాశాలు విద్యార్ధులకు వాటి బోధనాసుపత్రుల్లోనే ఇంటర్న్‌షిప్ కల్పించాలని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలకు ఆదేశాలు జారీ చేశారు.

వైద్య విద్య సంచాలకులు డాక్టర్ రమేశ్ రెడ్డి మాట్లాడుతూ..”ప్రస్తుతం ఉస్మానియా, గాంధీ వైద్య కళాశాలల్లో మొత్తం 500 మంది విద్యార్థులు ఉన్నారు. మరో 500 మందిని రెండు చోట్లా ఇంటర్న్‌షిప్‌నకు చేర్చుకుంటున్నాం. ఇంటర్న్ షిప్ పూర్తయిన వెంటనే ఎంబీబీఎస్ పట్టాను రాష్ట్ర వైద్య మండలిలో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అర్హత లభిస్తుంది. ఎంబీబీఎస్ ఉత్తీర్ణులైన రెండేళ్లలోపు 12 నెలలు ఇంటర్న్‌షిప్ పూర్తి చేయాలి. విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసి వచ్చిన వారైతే, అర్హత పరీక్ష ఉత్తీర్ణులైన రెండేళ్లలోపు చేయాలి. వీరు ముందస్తు అనుమతి పొందడం ద్వారా 15 రోజుల సాధారణ సెలవును, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అనుసరించి, తల్లి ప్రసూతి సెలవులను తీసుకోవచ్చు. తండ్రి 2 వారాల పాటు పెటర్నిటీ లీవ్ పొందవచ్చు. ఆసుపత్రుల్లో ఇంటర్న్‌షిప్ విద్యార్ధులకు మార్గదర్శనం చేసేందుకు పీజీ వైద్యవిద్య పూర్తి చేసిన వైద్యుడిని తప్పనిసరిగా కేటాయించాలి. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా నెలనెలా ఉపకారవేతనం అందించాల్సి ఉంటుంది” అని ఆయన అన్నారు.