సినీ ప్రియులకు గుడ్‌న్యూస్.. టికెట్ ధరలు తగ్గింపు!.. - MicTv.in - Telugu News
mictv telugu

సినీ ప్రియులకు గుడ్‌న్యూస్.. టికెట్ ధరలు తగ్గింపు!..

June 6, 2022

రెండు తెలుగు రాష్ట్రాల సినీ ప్రియులకు టాలీవుడ్ నిర్మాతలు శుభవార్తను చెప్పారు. రెండు సంవత్సరాలపాటు కరోనాతో తీవ్రంగా నష్టపోయిన సినీ ఇండస్ట్రీ, గతకొన్ని నెలలుగా మళ్లీ పుంజుకోవటం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. కొన్ని నెలలుగా పెండింగ్‌లో ఉన్న భారీ బడ్జెట్ సినిమాలను నిర్మాతలు విడుదల చేయటం మొదలుపెట్టారు. మరోవైపు ఓటీటీ పరంగా, థియేటర్స్ పరంగా వారం వారం కొత్త సినిమాలను రిలీజ్ చేస్తూ, అభిమానులకు ఆనందాన్ని కలుగజేస్తున్నారు.

ఈ క్రమంలో నిర్మాతలు ఓ కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లు సమాచారం. రాబోయే సినిమాలకు ఎలాంటి టికెట్లు ధరలు పెంచకుండా ప్రతి సామాన్యుడు సినిమాను వీక్షించేలా టికెట్ల ధరలను తగ్గించాలని నిర్ణయించారట. కొన్ని నెలల కిందట టికెట్ ధర పెరగాలన్న లక్ష్యంతో నిర్మాతలు, హీరోలు రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలను కలిసిన సంగతి తెలిసిందే. తాజాగా టికెట్ల ధరలపై నిర్మాతలు, హీరోలు చర్చలు జరిపి ఈ నిర్ణయానికి వచ్చారట.

అందుకు ప్రధాన కారణం.. కొన్ని కోట్లు పెట్టి సినిమాలను చిత్రీకరించినా, పెరిగిన టికెట్ల ధరలను చూసి ప్రేక్షకులు థియేటర్స్‌కు రావటం మానేస్తున్నారట. ‘అంత ధర పెట్టి టికెట్ కొనడం ఎందుకు? ఓటీటీలోనో, టెలివిజన్లోనో వచ్చినప్పుడు చూద్దాం’ అని కుటుంబ సభ్యులతో థియేటర్ల నుంచి వెనక్కి వెళ్లిపోతున్నారట. ఇది టికెట్ ధరల ప్రభావమేనని నిర్మాతలు గుర్తించి, ‘మా సినిమా టికెట్‌ని ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే అమ్ముతాము’ అంటూ నిర్మాతలు ప్రచారం చేయటం స్టార్ట్ చేశారు. ఇటీవలే ‘ఎఫ్ 3’ సినిమా బృందం పలు ఇంటర్వ్యూలలో ‘మా సినిమా టికెట్ల ధరలు చాలా తక్కువ, కుటుంబ సభ్యులంతా వచ్చి చూడొచ్చు’ అంటూ చెప్పుకొచ్చారు.

ఇప్పుడు అదే బాటలో ‘మేజర్’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ‘పక్కా కమర్షియల్’ బృందం ముందుగానే టికెట్ ధరల గురించి ప్రేక్షకులకు స్పష్టతనిచ్చాయి. టికెట్ ధరలను పెంచటం లేదని ప్రకటించాయి. ప్రేక్షకుడిని మళ్లీ మునుపటిలా ఉత్సాహంగా థియేటర్‌కి తీసుకురావాలనే క్రమంలో సినీ నిర్మాతలు ఈ టికెట్ ధరల్ని తగ్గిస్తున్నారట. అంటే రాబోయే సినిమాలను ప్రతి సామాన్యుడు థియేటర్‌కి వెళ్లి ప్రతి సినిమాను చూడొచ్చు అన్నమాట.