Good news for Nagarjuna fans..we both are doing a film
mictv telugu

ఫ్యాన్స్‌కు నాగార్జున గుడ్‌న్యూస్..మేమిద్దరం సినిమా చేస్తున్నాం..

September 26, 2022

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సినీ ప్రియులకు అక్కినేని కుటుంబం గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అక్కినేని నాగేశ్వరరావు మొదలుకొని..నాగార్జున, నాగచైతన్య, అఖిల్ హీరోలుగా ఇప్పటికే అటు ఇండస్ట్రీలోనూ ఇటు ప్రేక్షకుల్లోనూ మంచి పేరును సంపాదించుకున్నారు. అంతేకాదు, నాగార్జున సతీమణి అమల కూడా పలు సినిమాల్లో తల్లి పాత్రలో నటించి, మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.

ఈ క్రమంలో నాగార్జున హీరోగా తాజాగా నటించిన సినిమా ‘ది ఘోస్ట్’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటు గతరాత్రి కర్నూలులో జరిగింది. ఇందులో భాగంగా అక్కినేని అభిమానులకు నాగార్జున ఓ శుభవార్తను చెప్పారు. త్వరలోనే అఖిల్, తాను ఓ సినిమాను చేయబోతున్నాం అని ప్రకటించాడు.

“ఇక్కడ ఇంతమందిని ఇలా చూస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున ఈ వేదికపై నేను, చైతూ, అఖిల్ ఇంతటి ప్రేమను అందుకుంటున్నందుకుగాను ఇద్దరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఒకటి తెలుగు సినిమా పరిశ్రమ అయితే రెండవది మా నాన్నగారు. 33 ఏళ్ల క్రితం ‘శివ’ అనే సినిమా మీ ముందుకు వచ్చింది .. అప్పుడు ‘చైన్’ పట్టుకుని వచ్చాను. అదే అక్టోబర్ 5వ తేదీన ఈ సారి ఒక ‘కత్తి’ పట్టుకుని వస్తున్నాను. విజయదశమి అందరికీ విజయాన్ని ఇస్తుందని అంటారు. ఈ పండగ ‘ది ఘోస్ట్’ సినిమాకి విజయాన్ని ఇస్తుందని భావిస్తున్నాను. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్రవీణ్ సత్తారు ఈ సినిమాలో నాతో చాలా కొత్తగా చేయించాడు” అని నాగార్జున అన్నారు.