Good news for passengers..Reduction in interstate bus fares
mictv telugu

ప్రయాణికులకు శుభవార్త..అంతర్రాష్ట్ర బస్సుల చార్జీలు తగ్గింపు

September 3, 2022

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఓ శుభవార్త చెప్పింది. అంతర్రాష్ట్ర ఏసీ బస్సుల చార్జీలను 10 శాతం తగ్గిస్తూ, శుక్రవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయానికి కారణాలను కూడా తెలియజేసింది.”ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఏలాంటి శుభకార్యాలు, ముహూర్తాలు లేవు. బస్సు ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉంది. ఏసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో కూడా బాగా పడిపోయింది. దీంతో ప్రయాణికులను ఆకట్టుకునే క్రమంలో టికెట్‌ ధరల బేసిక్‌పై పది శాతం తగ్గించాలని నిర్ణయం తీసుకున్నాం” అని అధికారులు తెలిపారు.

ఇక, ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే.. గతరాత్రి ఏసీ బస్సు ఛార్జీలను తగ్గిస్తూ, ఏపీఎస్ ఆర్టీసీ ఓ ప్రకటన విడుదల చేసింది. తగ్గించిన బస్సు ఛార్జీల్లో ఏకంగా 20శాతం వరకు తగ్గించినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే, తగ్గించిన ఈ ఛార్జీలు తాత్కాలికంగా ఈ నెల 30వరకు మాత్రమే అమల్లో ఉంటాయని తెలిపారు. ఇందులోనూ శుక్రవారం, ఆదివారం మినహా మిగతా రోజుల్లో మాత్రమే ఛార్జీలు తగ్గిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రూట్లు, ఛార్జీలు ఎంత తగ్గించాలనే నిర్ణయాన్ని రీజినల్ మేనేజర్లకు అప్పగించామని, ఛార్జీల తగ్గింపుపై జిల్లాల ఆర్టీసీ అధికారులు ప్రకటనలు జారీ చేస్తారని తెలిపారు.

ఈ క్రమంలో ఆంధ్ర ప్రాంతం వైపు వెళ్లే మార్గాల్లో, ప్రయాణికులు టీఎస్‌ ఆర్టీసీ ఏసీ బస్సుల కంటే ఏపీఎస్‌ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ఎక్కేందుకే మొగ్గు చూపుతుండడంతో.. తమ ఏసీ సర్వీసుల్లో కూడా టికెట్‌ చార్జీలను సవరించాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. తగ్గించిన ఈ ఛార్జీలు శనివారం నుంచి అమల్లోకి వచ్చి, ఈ నెలాఖరు వరకు కొనసాగనున్నట్టు ఆర్టీసీ ఓ ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్‌–విజయవాడ మధ్య నడిచే గరుడప్లస్, రాజధాని సర్వీసుల్లో శుక్ర, ఆదివారాలు మినహా మిగతా రోజుల్లో 10 శాతం తగ్గింపు వర్తిస్తుందని, బెంగుళూరు నుంచి హైదరాబాద్‌ వచ్చే సర్వీసుల్లో శుక్రవారం, హైదరాబాద్‌ నుంచి బెంగుళూరు వైపు వెళ్లే ఏసీ బస్సుల్లో ఆదివారం మినహా మిగతా రోజుల్లో ఈ తగ్గింపు వర్తిస్తుందని పేర్కొంది.