Good news for people of Guntakallu..meal for Rs.6
mictv telugu

గుంతకల్లు వాసులకు గుడ్‌న్యూస్..రూ.6కే భోజనం

August 11, 2022

Good news for people of Guntakallu..meal for Rs.6

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గ ప్రజలకు, నిరుపేదలకు, నిరాశ్రయులకు ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి గుడ్‌న్యూస్ చెప్పారు. గుంతకల్లులోని ప్రభుత్వాస్పత్రి పక్కన ‘వైఎస్సార్‌–వైవీఆర్‌ క్యాంటీన్‌’ను ఏర్పాటు చేశామని, ఈ క్యాంటీన్ ద్వారా నిరుపేదల, నిరాశ్రయుల ఆకలిని తీర్చటం కోసం కేవలం రూ.6కే రుచికరమైన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

నేడు గుంతకల్లులోని ప్రభుత్వాస్పత్రి పక్కన ఏర్పాటు చేసిన ‘వైఎస్సార్‌–వైవీఆర్‌ క్యాంటీన్‌’ను ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే వైవీఆర్‌ మాట్లాడుతూ..’దేవుడి దయ, నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఉడతాభక్తిగా ఈ చిరు అన్నదాన సేవా కార్యక్రమాన్ని నేను ఉన్నంతవరకూ నిస్వార్థంగా, నిరాటంకంగా కొనసాగిస్తాను. ప్రతి రోజూ మధ్యాహ్నం 500 మందికి రుచికరమైన వేడి భోజనాన్ని రూ.6కే అందజేస్తాము. కావున నియోజకవర్గంలో ఉన్న నిరుపేదలు, నిరాశ్రయులు ఈ మధ్యాహ్న భోజనాన్ని సద్వినియోగం చేసుకోండి” అని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ భవానీ, వైస్‌ చైర్‌పర్సన్లు నైరుతిరెడ్డి, మైమూన్, రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు రుకియాబేగం, వీరశైవలింగాయత్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ యుగంధర్‌రెడ్డి, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు అధికారులు పాల్గొన్నారు.