Good news for Telangana constable candidates.. 2 marks for all candidates
mictv telugu

తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. అందరికీ 2 మార్కులు

September 1, 2022

తెలంగాణలో కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షను ఈ నెల 28న నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ప్రైమరీ కీని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) మంగళవారం విడుదల చేసింది. పోలీసుశాఖలో 15,644, ఆబ్కారీశాఖలో 614, రవాణాశాఖలో 63 పోస్టుల కోసం ఆగస్టు 28న ఈ పరీక్ష నిర్వహించారు. మొత్తం 6,61,198 మంది దరఖాస్తుదారులకుగాను 6,03,955 మంది పరీక్షకు హాజరయ్యారు. ఈనేపథ్యంలో పరీక్ష కీని వెబ్‌సైట్‌లో పొందుపరచగా.. అభ్యర్థులందరికీ 2 మార్కులు కలపనున్నట్లు ప్రకటించారు అధికారులు.

సరైన సమాధానాలతో సంబంధం లేకుండా అభ్యర్థులందరికీ రెండు మార్కులు కలుపనున్నారు. ప్రశ్నాపత్రం ‘ఎ’ బుక్‌లెట్‌లో 56వ, 129వ ప్రశ్నలకు నాలుగు ఆప్షన్లు సరైన సమాధానాలే. అభ్యర్థులు ఏ ఆప్షన్‌పై టిక్‌ చేసినా మార్కు వచ్చినట్లే. అలాగే ఆ రెండు ప్రశ్నల్ని వదిలేసినా మార్కు ఉన్నట్లే లెక్క. దీంతో అభ్యర్థులు 58 మార్కులు సాధిస్తే.. అర్హత పొందుతారన్నమాట. మరో మూడు ప్రశ్నలను వదిలేసినా మార్కులు కేటాయించనున్నారు అధికారులు. ఏ బుక్ లెట్ లోని 68వ ప్రశ్నకు 4, 76వ ప్రశ్నకు 4, 158వ ప్రశ్నకు 1,3 ఆప్షన్లు సరైనవిగా నిర్ధారించారు అధికారులు. అయితే.. ఈ ఆప్షన్లను ఎంచుకున్న వారితో పాటు ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా వదిలేసిన వారికి కూడా మార్కులు కేటాయిస్తారని కీలో పేర్కొన్నారు అధికారులు.