తెలంగాణ యువతకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలో 20 వేల పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. శిక్షణ పొందిన ఎస్సైల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమం తెలంగాణ పోలీస్ అకాడమీలో నిర్వహించారు. 1,162 మంది ఎస్సైలు శిక్షణ పూర్తి చేసుకోగా, వారిలో 256 మంది మహిళా ఎస్సైలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మహమూద్ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ త్వరలో భారీగా పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.
త్వరలోనే 20 వేల పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తామని మంత్రి తెలిపారు. ‘తెలంగాణ పోలీస్ అకాడమీ ద్వారా ఇప్పటివరకు 1,25,848 మందికి శిక్షణ ఇచ్చాం. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా 18,428 మంది ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేశాం. తాజా మార్పులకు అనుగుణంగా పరిస్థితులను అర్థం చేసుకుని సమయోచితంగా, రాజ్యాంగ బద్దంగా పోలీస్ అధికారులు పనిచేయాలి. తెలంగాణలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోంది. శాంతి భద్రతలు సక్రమంగా ఉంటేనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యపడుతుంది. దేశవ్యాప్తంగా తెలంగాణ పోలీసులకు గుర్తింపు ఉంది. దానిని నిలబెట్టుకోవాలి. నూతన సాంకేతికతకు ప్రాధాన్యమిస్తూ పోలీస్ శాఖకు అధిక బడ్జెట్ కేటాయిస్తున్నాం. కరోనా, భారీ వర్షాల వంటి కష్టకాలంలో పోలీసులు అందించిన సేవలు మరిచిపోలేనివి. ప్రజలకు సేవ చేయడం ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరికీ గౌరవం ఇవ్వాలి’ అని మహమూద్ అలీ అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ మేరకు నేరరహిత సమాజాన్ని కల్పించాలని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. సమాజంలో మార్పు పోలీసులతోనే సాధ్యం అవుతుందని.. ప్రభుత్వ పథకాల అమల్లోనూ పోలీసు శాఖ భాగస్వామ్యం కావాలని మహేందర్ రెడ్డి ఆకాంక్షించారు.