Good news for the couple at Gandhi Hospital..the treatments are free
mictv telugu

తెలంగాణ: దంపతులకు గాంధీ ఆసుపత్రి శుభవార్త..ఆ చికిత్సలు ఉచితం

July 25, 2022

తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన పేద దంపతులకు గాంధీ ఆసుపత్రి ఓ శుభవార్తను చెప్పింది. పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా, సంతానం లేక ఇబ్బందులు పడుతున్నా వారికి, కుటుంబ నియంత్రణ చికిత్స చేయించుకున్న వారికి, ఏదైనా కారణంతో మళ్లీ పిల్లలు కావాలనుకునే దంపతులకు గాంధీ ఆసుపత్రిలో పలు సేవలను ఉచితంగా అందిస్తున్నామని గాంధీ సంతాన సాఫల్య కేంద్రం ఇన్‌ఛార్జి డాక్టర్ జానకి వెల్లంకి అన్నారు.

”హైదాబాద్‌లో ఉన్న ప్రభుత్వ గాంధీ ఆసుపత్రిలో సంతాన సాఫల్య కేంద్రం మే నెల నుంచి పూర్తి స్థాయిలో సేవలు అందిస్తోంది. ప్రస్తుతం.. ల్యాప్రోస్కోపీ, అలాసౌండ్, ఆపరేషన్ థియేటర్, మైక్రోస్కోప్, డ్రై ఇంక్యుబేటర్, ఐయూఐ ల్యాంప్, టెస్ట్ ట్యూబ్ వార్మర్, సెఫీ మార్కెల్, కౌంటింగ్ ఛాంబర్, రేమీ కాంపాక్ట్ క్లినికల్ సెంట్రిఫ్యూజ్, ఎయిర్‌ఫ్లో క్యాబినెట్ పరికరాల ద్వారా దంపతులకు పిల్లల విషయంలో ఆధునాతన సేవలను అందిస్తుంది. రెండు ఆపరేషన్ థియేటర్లు సిద్ధం చేస్తున్నాం. గత నెల రోజుల్లో పది వరకు రీకెనలైజేషన్ శస్త్ర చికిత్సలు చేశాం. ప్రైవేటులో ఈ చికిత్సకు రూ. లక్ష 2 లక్షల అవుతుంది. కానీ, గాంధీలో ఉచితంగా చేస్తున్నాం. త్వరలో పేట్లబుర్జు, వరంగల్ ఎంజీఎం ఆసుపత్రుల్లోనూ ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

ఇంట్రాయుటెరైన్ ఇన్సెమినేషన్(ఐయూఐ) పద్ధతి ద్వారా గాంధీలో 18 మందికి సంతాన భాగ్యం కలిగింది. ఈ పద్ధతి ద్వారా.. భర్త నుంచి వీర్యం సేకరించి, ల్యాబ్‌లో శుద్ధి చేసి, హైలీ కాన్సన్‌ట్రేటెడ్ మొటిలిటీ స్పెర్మ్‌గా మార్చి భార్య అండాశయంలోకి పంపుతాం. మరో ఆరు నెలల్లో.. ‘ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్(ఐవీఎఫ్) చికిత్సలు అందుబాటులోకి రానున్నాయి. ఈ పద్ధతిలో ల్యాబ్‌లో పిండం ఫలదీకరణ చెందిన తర్వాత మహిళ గర్భంలో ప్రవేశపెడతాం. ఇది ప్రైవేటు ఆసుపత్రుల్లో చాలా ఖర్చుతో కూడుకున్న చికిత్స. కానీ, గాంధీలో ఉచితంగా చేస్తాం.” అని ఆమె అన్నారు.