హైదరాబాద్ వాసులకు శుభవార్త.. ఇంటి వద్దకే పెట్రోల్, డీజిల్ - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్ వాసులకు శుభవార్త.. ఇంటి వద్దకే పెట్రోల్, డీజిల్

June 25, 2022

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ వాసులకు అధికారులు ఓ శుభవార్తను చెప్పారు. ప్రస్తుతం వినియోగదారులు వారికి కావాల్సిన ప్రతి వస్తువును ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే ఇంటివద్దకే.. ఆహారం, కూరగాయలు, గృహోపకరణాలు తదితర వస్తువులన్నీ వస్తున్నాయి. ఇదే విధంగా ఇక నుంచి గోఫ్యూయెల్‌ ఇండియా సంస్థ తయారు చేసిన మొబైల్‌ యాప్‌ సహాయంతో ఇంటి వద్దకే పెట్రోల్‌, డీజిల్‌ను సరఫరా చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

గోఫ్యూయెల్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ఫ్రాంచైజీ భాగస్వాములైన హెచ్‌పీసీఎల్‌ సీజీఎం హరిప్రసాద్‌ సింగు పల్లి, సుస్మిత ఎంటర్‌ప్రైజెస్‌తో కలిసి గోఫ్యూయెల్‌ ఇండియా సంస్థ తమ కార్యకలాపాలను ఆవిష్కరించింది. అనంతరం సంస్థ కోఫౌండర్‌ ఆదిత్య మీసాల మాట్లాడుతూ.. ”ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుంది. వినియోగదారులు షాపులకు వెళ్లకుండా కొన్ని యాప్స్ ద్వారా ఇంట్లోకి కావాల్సిన ప్రతి వస్తువును ఆర్డర్ చేస్తున్నారు. మా సంస్థ తయారు చేసిన యాప్‌ ద్వారా వినియోగదారులకు పెట్రోల్, డీజిల్‌ను సరఫరా చేస్తాం. ఇప్పటికే ఈ సేవలు చెన్నైలో అందుబాటులోకి వచ్చాయి. వినియోగదారులు యాప్‌లో ఆర్డర్‌ చేస్తే ఇంధనాన్ని వారు కోరుకున్న చోటుకు అందిస్తాం. జూలై–సెప్టెంబర్‌లో గువాహటి, సేలంలో కార్యకలపాలను ప్రారంభిస్తాం. 2024 నాటికి దేశమంతటా 1,000 వాహనాలతో విస్తరించడానికి ప్రణాళికలు రూపొందించాం. అపార్ట్‌మెంట్లు, పరిశ్రమలు, ఆసుపత్రులు, మాల్స్, బ్యాంకులు, గిడ్డంగులు తదితర స్థలాలకు సరఫరా చేస్తాం” అని ఆయన అన్నారు.