పులివెందుల వాసులకు గుడ్‌న్యూస్: జగన్ - MicTv.in - Telugu News
mictv telugu

పులివెందుల వాసులకు గుడ్‌న్యూస్: జగన్

March 17, 2022

jbn

ఆంధ్రప్రదేశ్‌లోని పులివెందుల ప్రజలకు జగన్ మోహన్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఏప్రిల్‌ నుంచి పులివెందులలో ఇళ్ల పట్టాలు, ఇంటి నిర్మాణాలు మొదలవుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా గురువారం అసెంబ్లీ ఆయన మాట్లాడుతూ.. ”ప్రతి ఎమ్మెల్యే గర్వపడేలా ఏపీలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వైసీపీ హయాంలో ఎలాంటి వివక్షకు తావులేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. ఇవాళ రాష్ట్రంలో ఇళ్లు కాదు. ఊళ్లు కడుతున్నాం. ఇప్పటికే 30.76 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు అందజేశాం. సొంతిళ్లు నిర్మించుకోవాలనేది ప్రతీ ఒక్కరి కల. ఈ కలను నెరవేర్చేందుకు అధికారులు మహాయజ్ఞం చేశారు” అని జగన్ అన్నారు.

అంతేకాకుండా రాష్ట్రంలో 17 వేల కాలనీలు ఏర్పాటు కాబోతున్నాయని, తొలి దశలో 10 వేలకు పైగా జగనన్న కాలనీల నిర్మాణం జరుగుతుందని, ప్రతి కాలనీలో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఇందుకోసం రూ.32 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఇళ్ల పట్టాల పంపిణీ కోసం కోసం 71,811 ఎకరాల భూమి సేకరించామన్నారు. ప్రతి మహిళ చేతికి రూ.5 లక్షల వరకు ఆస్తిని ఇచ్చామని అన్నారు.

అనంతరం వచ్చే డిసెంబర్‌ నాటికి టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇళ్ల నిర్మాణాల పర్యవేక్షణకు ప్రతి జిల్లాలో ఒక జాయింట్‌ కలెక్టర్‌ను నియమించామని తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీలో ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ అందుబాటులో ఉన్నారని.. ఇంటి నిర్మాణాలను బట్టి దశల వారీగా బిల్లుల చెల్లింపు ఉంటుందన్నారు. విశాఖలో 1.80 లక్షల ఇళ్లకు ఇటీవలే కోర్టు క్లియరెన్స్‌ ఇచ్చిందని అన్నారు.

ఇక, తన నియోజకవర్గమైన పులివెందుల అభివృద్ది విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుకుంటున్నారు. అయినా కోర్టు ఆదేశాల మేరకు పనులు మొదలయ్యాయని తెలిపారు. ఏప్రిల్‌లో పులివెందులలో ఇళ్ల పట్టాలు, ఇంటి నిర్మాణాలు మొదలవుతాయని చెప్పారు. ఈ మహా యజ్ఞానికి ఆటంకం కలిగిచేందుకు టీడీపీ శాయశక్తులా కృషి చేశారని మండిపడ్డారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయితే ఎక్కడ తనకు మంచి పేరు వస్తుందని విపరీతమైన దుర్భుద్ధితో కుట్రలు చేస్తున్నారని జగన్ మండిపడ్డారు.