ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ యూజేఎం రావు విశాఖపట్టణం ప్రజలకు శుభవార్తను చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ”విశాఖ మహానగరంలో 76 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ వ్యవస్థ ఖరారైంది. ఇందులో 54 స్టేషన్లు, రెండు డిపోలు ఉంటాయి. ఈ విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు ఐదేళ్లలో పూర్తి అవుతుంది. మెట్రో రైల్ ప్రాజెక్టు ఏర్పాటుకు హై పవర్ కమిటీని ఏర్పాటు చేశాం. హై పవర్ కమిటీ ఆధ్వర్యంలో రూ.14,309 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు అంచనాలు రూపొందించాం” అని ఆయన అన్నారు.
ఈ మెట్రో రైలు ప్రాజెక్టు నేపథ్యంలో, స్థానికుల స్థలాలకు, భవనాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకుంటామని యూజేఎం రావు స్పష్టం చేశారు. ఈ వార్తతో విశాఖ ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా ప్రయాణం చేయాలంటే, నానా ఇబ్బందులకు పడుతున్న ప్రయాణికులకు, చిరు ఉద్యోగుల కష్టాలు మరో ఐదేళ్లలో తీరునున్నాయి.