నిరుద్యోగులకు శుభవార్త.. రెండు రోజుల్లో ప్రకటన - MicTv.in - Telugu News
mictv telugu

నిరుద్యోగులకు శుభవార్త.. రెండు రోజుల్లో ప్రకటన

June 7, 2022

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్యను అభ్యసించిన నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. మరో రెండు రోజుల్లో మొదటి విడతగా 1,326 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామని సోమవారం అధికారులు ప్రకటన విడుదల చేశారు. రానున్న మరో రెండు వారల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు పూర్తి నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని వైద్యశాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. తెలంగాణలో ఇటీవలే గ్రూప్-1, పోలీసు శాఖకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ పూర్తైంది. ఇక వైద్యారోగ్యశాఖలోని ఖాళీలపై కేసీఆర్ సర్కార్ దృష్టి సారించింది.

మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..”వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 12,755 పోస్టుల భర్తీకి రంగం సిద్దమైంది. ముందుగా మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ద్వారా 10,028 పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు ఇస్తాం. ఇతర పోస్టులను టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తాం. వారం వారం విడతల వారీగా ఆయా విభాగాలకు సంబంధించిన నోటిఫికేషన్లను జారీ చేయాలని నిర్ణయించాం. ముందుగా వైద్య విద్య, ప్రజారోగ్య విభాగం, టీవీవీపీ, ఐపీఎం విభాగాల్లో మొత్తం 1,826 పోస్టుల భర్తీకి మెడికల్ బోర్డు ద్వారా నియమకాలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాను. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అనుసరించి ఎలాంటి న్యాయ వివాదాలు తలెత్తకుండా నోటిఫికేషను రూపొందించాలని చర్చలు జరిపాం.” అని ఆయన అన్నారు.

ఈ ఉదోగ్యాలకు సంబంధించి సోమవారం మెడికల్ బోర్డు, ఆరోగ్యశాఖ, ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో హరీశ్ రావు ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. కరోనా కాలంలో సేవలందించిన ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగాల భర్తీలో 20 శాతం వెయిటేజీ ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఆయుష్ విభాగంలోని పోస్టులను మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారానే భర్తీ చేయాలని, టెక్నికల్ పోస్టులతోపాటు, ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ వంటి పోస్టులను టీఎస్ పీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని, నిమ్స్‌లోని ఖాళీలను నిమ్స్ బోర్డు, మిగతా అన్ని పోస్టులను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీచేయాలని అన్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సివిల్ అసి స్టెంట్ సర్జన్ స్పెషలిస్టులు, ట్యూటర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, స్టాఫ్ నర్సులు, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లు వంటి పోస్టులతో పాటు ఆయుష్ విభాగంలోని స్టాఫ్ నర్సుల పోస్టులను కూడా మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.

ఇక, ప్రస్తుతం ఇచ్చే నోటిఫికేషన్‌లో ట్యూటర్స్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు ఉన్నాయి. ఎంబీబీఎస్ అర్హత గల అభ్యర్థులు ఔట్‌సోర్సింగ్ ద్వారా సేవలందిస్తున్న వారికి 20 శాతం వెయిటేజి మార్కులు, మిగతా 80 శాతం వారు ఎంబీబీఎస్ డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేయాలని అధికారులు నిర్ణయించారు. మరో రెండు రోజుల్లో మొదటి విడతగా 1,326 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయాలని, ఆ వెనువెంటనే స్టాఫ్ నర్సులకు, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీచేయాలని మంత్రి సూచించారు.