నిరుద్యోగులకు శుభవార్త.. సబితా ఇంద్రారెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

నిరుద్యోగులకు శుభవార్త.. సబితా ఇంద్రారెడ్డి

April 21, 2022

03

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల జాతర మొదలైంది. ఇప్పటికే నిరుద్యోగులు పుస్తకాలతో కుస్తీ పట్టడం ప్రారంభించారు. ఈసారి ఎలాగైనా ఉద్యోగం సాధించాలని కొంతమంది నిరుద్యోగులు కోచింగ్ సెంటర్ల బాటపడుతున్నారు. దీంతో ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలు విపరీతంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. చేసేది ఏమి లేక కొంతమంది ఫీజులు చెల్లిస్తున్నారు. మరికొంతమంది డబ్బులు లేక నానా అవస్థలు పడుతున్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు దీటుగా పేద నిరుద్యోగులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని ఆరు యూనివర్శిటీల్లో ఫ్రీ కోచింగ్ ఇస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ప్రకటించిన ప్రకారమే వర్చువల్ మోడ్ విధానంలో ఫ్రీ కోచింగ్‌ను సబిత, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి ప్రారంభించారు.

సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ..”ఫ్రీ కోచింగ్ కోసం ఆరు యూనివర్శిటీలకు నిధులు అందించాం. నాణ్యతతో కూడిన కోచింగ్ ఇస్తాం. ఉద్యోగార్థులు కోచింగ్ సెంటర్లకు వెళ్లకుండా యూనివర్శిటీల్లోనే ఉచిత కోచింగ్ ఇవ్వాలని కేసీఆర్ చెప్పారు. ఉద్యోగ నోటిఫికేషన్లన్నీ ఒకేసారి ఇవ్వకుండా ఒకదాని తర్వాత ఒకటి ఇవ్వాలని నిర్ణయించాం. స్టడీ మెటీరియల్ కొరత లేకుండా చూస్తాం. అందరూ కష్టపడి చదవండి. అందరికీ ఆల్ ది బెస్ట్” అని అన్నారు.