డెబిట్ కార్డ్ లేనివారికీ శుభవార్త - MicTv.in - Telugu News
mictv telugu

డెబిట్ కార్డ్ లేనివారికీ శుభవార్త

March 11, 2022

card

గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ డెబిట్ కార్డు లేనివారు చాలా మందే ఉన్నారు. డెబిట్ కార్డ్ అంటే ఏంటీ? అది ఎలా ఉంటుంది? ఎలా వాడాలి? అనే సందేహాలు ఉన్నవారు లేకపోలేదు. వీరంతా యూపీఐ సేవలకు దూరంగా ఉంటున్నారు. ఇలాంటి వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఆధార్ నంబర్, ఓటీపీ ద్వారా యూపీఐ సేవలను పొందడానికి వీలుగా మార్పులు చేయాలని బ్యాంకులకు సూచించింది. ప్రస్తుతం యూపీఐ సేవలు పొందాలంటే డెబిట్ కార్డుపై ఉన్న చివరి ఆరు అంకెల నంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీ ధ్రువీకరణ తర్వాత యూపీఐ పిన్ సెట్ చేసుకున్నాక నిరంతరాయ సేవలను పొందే వీలుంది. ఆధార్ నంబర్‌తో చెల్లింపుల కోసం గతేడాదే ఎస్పీసీఐ సర్క్యులర్ జారీ చేసింది. డిసెంబర్ 15లోపు నిబంధనలు అమలు చేయాలని సూచించింది.

అయితే, వివిధ కారణాల వల్ల బ్యాంకులకు వీలు పడకపోవడంతో తాజాగా ఆ గడువును ఎస్పీసీఐ మార్చి 158 పొడిగించింది. దేశ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున జన్ ధన్ ఖాతాలు తెరిచారు. వారిలో కొంత మందికి డెబిట్ కార్డులు జారీచేసినప్పటికీ… కార్డులను యాక్టివేట్ చేసి వాడుతున్నవారు తక్కువే మంది. ఈ నేపథ్యంలో అలాంటి వారు కూడా యూపీఐ సేవలు పొందేందుకు వీలుగా ఎస్పీసీఐ ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది. అయితే, ఆధార్, ఓటీపీతో యూపీఐ సేవలు పొందాలంటే ఉపయోగించే మొబైల్ నంబర్ ఆధార్‌కు అనుసంధానం చేసిన ఉండాలి. అదే నంబర్ బ్యాంకు ఖాతాకు కూడా అనుసంధానం చేసి ఉంటేనే సాధ్యపడుతుంది.

మరోపక్క ఈ సేవలకు సంబంధించి ఇప్పటికే దేశంలో వాట్సాప్ వంటి మెసేజింగ్ సేవలందించే సంస్థలతో పాటు గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే వంటి థర్డ్ పార్టీ సంస్థలు సైతం వివిధ ఆఫర్లతో ఆకట్టుకుంటున్నాయి. దీంతో యూపీఐ చెల్లింపులకు ఆదరణ పెరిగింది. ఈ సేవలు పొందాలంటే బ్యాంకు డెబిట్ కార్డు తప్పనిసరిగా వాడాలి.