తెలంగాణ రాష్ట్ర ప్రజలకు టీఎస్ ఆర్టీసీ మరో శుభవార్త చెప్పింది. ఇకనుంచి రాష్ట్రంలో జరిగే పండగలకు, వేసవి సెలవుల్లో జరిగే జాతరలకు ప్రభుత్వం తరుపున నడిపే ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలను సగానికి తగ్గిస్తూ, నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సెస్ బాదుడు, ఛార్జీల పెంపుతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఆర్టీసీ అధికారులు సమావేశమై, పండగల సమయాల్లో నడిపే స్పెషల్ బస్సుల్లో ఇకనుంచి ఛార్జీలను 25శాతం మాత్రమే వసూలు చేయాలని నిర్ణయించారు.
ఆర్టీసీ ప్రస్తుతం ఈ బస్సుల్లో వెళ్లే ప్రయాణికుల నుంచి సాధారణ ఛార్జీలకంటే అదనంగా 50 శాతం వసూలు చేస్తోంది. దీనికి తోడు ఇటీవల డీజిల్ ధరలు పెరగడంతో పల్లె వెలుగు బస్సుల్లో రూ.5, మిగిలిన అన్ని బస్సుల్లో రూ.10 చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారు. పెరిగిన ధరల వల్ల ప్రయాణికులపై మోయలేని భారం పడుతోంది. పరిస్థితిని గమనించిన అధికారులు వేసవి కాలంలో ధరలు పెరిగితే, ప్రయాణికులు ఆర్టీసీ బస్సులకు దూరమయ్యే అవకాశాలున్నాయని ఆందోళనతో అదనపు ఛార్జీని 25 శాతానికి పరిమితం చేయాలని నిర్ణయించారు.