తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు శుభవార్త చెప్పింది. గతకొన్ని నెలలుగా భక్తులు ఎంతగానో ఎదురుచూస్తున్న శ్రీవారి మెట్టు నడకమార్గం ఈరోజు (గురువారం) నుంచే అందుబాటులోకి వస్తోందని దేవస్థానం అధికారులు తెలిపారు. స్వామివారిని దర్శించుకోవటం కోసం భక్తులు తిరుమలకు నడిచి వస్తుంటారు. ఆ భక్తులు అలిపిరి మార్గంతోపాటు, శ్రీవారి మెట్టు మార్గాన్ని కూడా ఉపయోగిస్తుంటారు. గత సంవత్సరం నవంబరులో కురిసిన భారీ వర్షాలకు శ్రీవారి మెట్టు మార్గం అక్కడక్కడ ధ్వంసమైన విషయం తెలిసిందే.
గత ఐదు నెలలుగా అధికారులు చర్యలు చేపట్టి, ధ్వంసమైన మార్గానికి మరమ్మతులు చేయించారు. ఈ పనులకు సుమారు రూ. 3.60 కోట్లు ఖర్చు అయినట్లు అధికారులు తెలిపారు. 800, 1200 మెట్ల వద్ద కూలిపోయిన వంతెనలను కూడా పటిష్టంగా నిర్మించారు. మరికొద్ది గంటల్లో ఈ మార్గానికి ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం భక్తులను అనుమతించనున్నారు. చాలా నెలలు తర్వాత మెట్ల మార్గం గుండా కొండపైకి వెళ్లి స్వామివారిని దర్శించుకునే అవకాశం నేడు అందుబాటులోకి రావడంతో భక్తులు చాలా మంది అక్కడకు చేరుకున్నారు.