అన్నాడీఎంకేలో చెలరేగిన విభేదాలకు రేపోమాపో తెరపడనుంది. పార్టీ చీలిక గ్రూపులు ఒకటి కానున్నాయి. ఒక్కటి, రెండు రోజుల్లో ప్రజలు, పార్టీ శ్రేణులు సంతోషించేలా నిర్ణయం వస్తుందని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తెలిపారు. నిన్న ఆయన జయలలిత మోమోరియల్ వద్ద విలీనం గురించి మాట్లాడగా , తర్వాత శరవేగంగా కొన్ని రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యమంత్రి పదవి నుంచి పళనిస్వామి వైదొలగాలని పన్నీర్ సెల్వం వర్గంలోని కొందరు నేతలు కోరడంతో విలీన ప్రక్రియకు ఆంటకం ఏర్పడింది. అయితే ఇప్పుడు ఎలాంటి విభేదాలూ లేవని పన్నీర్ చెప్పారు. త్వరలో విలీనంపై సానుకూల నిర్ణయం వస్తుందని స్పష్టం చేశారు.
జయలలిత మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలన్న పన్నీర్ సెల్వం వర్గం డిమాండ్ ను పళనిస్వామి నెరవేర్చడం తెలిసిందే. అంతేకాక అవినీతి కేసులో ప్రస్తుతం జైలులో ఉన్న శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించి పన్నీర్ ను పార్టీ కార్యదర్శిగా నియమించాలని పన్నీర్ వర్గీయులు కోరుతున్నారు. పళనిస్వామి, పన్నీర్ సెల్వం.. ప్రధాని నరేంద్ర మోడితో వేరు వేరుగా భేటి అయ్యారు. బీజేపీ మద్దతుతో విలీన ప్రక్రియ ఊపందుకుంది.