ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇంటర్ పూర్తి చేస్తే చాలు ఐటీ రంగంలో ఉద్యోగాన్ని కల్పిస్తామని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ శుభవార్తను చెప్పింది. తమ కంపెనీ ద్వారా ఇంటర్న్‌షిప్‌తోపాటు గ్రాడ్యుయేషన్‌ను అందిస్తూ, సంస్థలో ఉద్యోగం కల్పిస్తామని పేర్కొంది. హెచ్‌సీఎల్ టెక్బీ ప్రోగ్రామ్ ద్వారా ఎంట్రీ లెవల్ ఐటీ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్య శిక్షణను అందిస్తామని, ప్రస్తుతం దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేశామని సంస్థ అధికారులు పూర్తి వివరాలను వెల్లడించారు.
”ఈ టెక్బీ ప్రోగ్రాంలో క్లాస్రూమ్ ట్రెయినింగ్, ఇంటర్న్‌షిప్ కూడా ఉంటుంది. ఈ ఉద్యోగానికి 2021/2022 విద్యా సంవత్సరంలో కనీసం 60శాతం మార్కులతో 12వ తరగతి/ తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. ఇంటర్లో మ్యాథమెటిక్స్/బిజినెస్ మ్యాథమెటిక్స్ సబ్జెక్టులు చదివి ఉండాలి. 12వ తరగతి 2022 ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. టెక్బీ ప్రోగ్రాంలో ప్రోగ్రామ్‌లో భాగంగా క్లాస్రూమ్ ట్రెయినింగ్, ఇంటర్న్‌షిప్ ఉంటుంది. స్టైపెండ్ రూ.10,000 చెల్లిస్తాం. ప్రోగ్రామ్ కాలవ్యవధి: 12 నెలలు. ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ పూర్తయిన తర్వాత హెచ్‌సీఎల్‌లో ఉద్యోగ అవకాశం కల్పిస్తాం” అని సంస్థ అధికారులు తెలిపారు.
ఇక, విభాగాల విషయానికొస్తే.. ఐటీ, సర్వీస్ డెస్క్, బిజినెస్ ప్రాసెస్ ఉన్నాయి. ఏడాదికి రూ.1.7లక్షలు-రూ.2.2లక్షల జీతాన్ని చెల్లిస్తారు. ఉద్యోగంలో చేరిన అభ్యర్థులు బిట్స్‌పిలానీ, ఆమిటీ, సస్త్రా యూనివర్సిటీల నుంచి గ్రాడ్యుయేషన్ చేసే అవకాశం ఉంటుంది. పూర్తి వివరాలకు అభ్యర్థులు వెబ్సైట్ https://www.hcltechbee.com/ని సందర్శించాలని కోరారు.