గుడ్‌న్యూస్..ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లకు కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్‌ - MicTv.in - Telugu News
mictv telugu

గుడ్‌న్యూస్..ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లకు కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్‌

June 22, 2022

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ మరో శుభవార్తను చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా పదకొండు విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, ఇతర ఖాళీలను వెంటనే భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి కేసీఆర్‌ మంగళవారం సబితా ఇంద్రారెడ్డితో, యూనివర్సిటీల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.

అనంతరం ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రత్యేకంగా రిక్రూట్‌మెంట్‌ బోర్డును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. యూనివర్సిటీల్లో ఏఏ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి? అనే వివరాలను అధికారులు కేసీఆర్‌కు వివరించారు. వెంటనే నియామకాలు చేపట్టాలని కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. రాష్ట్రంలోని 11 యూనివర్సిటీలు ఎవరికి వారుగా నియామకాలు చేపట్టకుండా ఉమ్మడి నియామక విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. వర్సిటీల వారీగా రిక్రూట్‌మెంట్‌ జరగడం వల్ల గతంలో వచ్చిన ఆరోపణలు, విమర్శలను పరిగణనలోకి తీసుకుని ఒకే రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఈ ఉద్యోగాలకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేయనున్నారు.

తెలంగాణలో మొత్తం 11 వర్సిటీలు ఉన్నాయి. అందులో మొత్తం 2,828 పోస్టులు ఉన్నాయి. అందులో 1,869 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 238 ప్రొఫెసర్‌ పోస్టులు, 781 అసోసియేట్‌ ప్రొఫెసర్, 850 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు ఉన్నాయి. ఇలా భారీ సంఖ్యలో ఖాళీలు ఏర్పడటంతో తాత్కాలిక, కాంట్రాక్టు అధ్యాపకులతో బోధన కొనసాగిస్తున్నారు. ఫలితంగా విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఎట్టకేలకు పోస్టుల భర్తీకి ప్రభుత్వం ముందుకు వచ్చింది.