తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. నిత్యం జనంతో, వాహనాల రద్దీతో బీజీ బీజీగా ఉండే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిసరాల్లో మినీ బస్సులను ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ అధికారులు రంగం సిద్దం చేశారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు నాలుగు వైపులా ఉన్న బస్‌స్టాప్‌లను అనుసంధానం చేస్తూ, మినీ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఓ బస్సును ఏర్పాటు చేశామని, కేవలం రూ.5 టికెట్‌తో ప్రయాణికులను ఒక బస్టాపు నుంచి మరో బస్‌స్టాప్ వరకు వెళ్లే విధంగా బస్సును నడుపుతున్నట్లు పేర్కొన్నారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..”కేవలం రెండు మూడు కిలోమీటర్ల పరిధిలోనే ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ఆటోల్లో వెళ్తే రూ.50 నుంచి రూ.100 వరకు చెల్లించాల్సి వస్తోంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ చుట్టూ ఉన్న బస్‌స్టాప్‌ల్లో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని టీఎస్ ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. కేవలం రూ. 5 టికెట్ ధర నిర్ణయించింది.
ఈ మినీ బస్సులు అందుబాటులోకి వస్తే.. ఘట్కేసర్, బోడుప్పల్ నుంచి చిలకలగూడ చౌరస్తాలో దిగి, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వెళ్లే వారికి వెసులుబాటు కలగనుంది. ఆ తర్వాత మల్కాజిగిరి, ఈసీఐఎల్ వైపు నుంచి వచ్చే ప్రయాణికులకు, అల్వాల్, బోయిన్పల్లి, జీడిమెట్ల, బాలానగర్, పటాన్చెరు నుంచి వచ్చే ప్రయాణికులకు ఊరట లభించనుంది.