తెలంగాణ రాష్ట్రంలో మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఇటీవలే విద్యుత్తు పంపిణీ సంస్థ 1201 పోస్టులు సిద్దంగా ఉన్నాయని, వీటికి సంబంధించి త్వరలోనే పూర్తి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ ప్రకటన ప్రకారం.. విద్యుత్తు శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులకు ఆదివారం అధికారులు ప్రకటన జారీ చేశారు. అందులో వెయ్యి జూనియర్ లైన్మెన్, 201 సబ్ ఇంజినీర్ పోస్టులు ఉన్నాయి.
అధికారులు మాట్లాడుతూ..”జూనియర్ లైన్మెన్ పోస్టులకు ఈ నెల 19 నుంచి దరఖాస్తులు ఆల్‌లైన్‌లో ప్రారంభమౌతాయి. జూన్ 17న రాత పరీక్ష ఉంటుంది. సబ్ ఇంజినీర్ పోస్టులకు జూన్ 15 నుంచి దరఖాస్తులు మొదలు అవుతాయి. జూలై 31న రాత పరీక్ష నిర్వహిస్తాం. అభ్యర్థులు http://tssouthernpower.cgg.gov.in వెబ్సైట్లో ఆప్లై చేసుకోవాలి. నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సిద్దిపేట, మెదక్, హైదరాబాద్ జిల్లాల్లో ఈ ఉద్యోగాలు ఉన్నాయి. దరఖాస్తుదారులు రూ. 200 ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు, రూ.120 పరీక్ష ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు లేదు” అని తెలిపారు.
ఇక విద్యార్హతల విషయానికొస్తే.. ఎస్సెస్సీతోపాటు ఐటీఐలో ఎలక్ట్రికల్ ట్రేడ్, వైర్‌మెన్ లేదా ఎలక్ట్రికల్ ట్రేడ్ లో ఇంటర్ ఒకేషనల్ కోర్సు పాసై ఉండాలి. వయస్సు.. 2022 జనవరి 1 నాటికి 18 నుంచి 35 ఏండ్ల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి ఐదేండ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది.