నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను చెప్పింది. నోయిడా ప్రధాన కేంద్రంగా ఉన్న నవోదయ విద్యాలయ సమితి (ఎన్వీఎస్) అధికారులు దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. విడుదల చేసిన నోటిఫికేషన్లో మొత్తం 1,616 పోస్టులు ఉన్నాయి. వీటిలో ప్రిన్సిపాల్, టీజీటీ, పీజీటీ తదితర పోస్టులున్నాయి. ఈ పోస్టులకు జులై 2 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. జులై 22న చివరితేది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో https://navodaya.gov.in/ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలని అధికారులు తెలిపారు.
ఈ 1,616 పోస్టుల్లో ప్రిన్సిపల్ 12, పీజీటీ 397, టీజీటీ 683, ఆర్ట్, పీఈటీ, లైబ్రేరియన్ 181 పోస్టులు ఉన్నాయి. ప్రిన్సిపాల్ పోస్టులకు కనీసం 50 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీతోపాటు బీఈడీ ఉత్తీర్ణత సాధించి, పని అనుభవం ఉండాలి. పీజీటీ పోస్టులకు రెండేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ డిగ్రీతోపాటు బీఈడీ ఉత్తీర్ణత ఉండాలి.టీజీటీ పోస్టులకు నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీతో పాటు బీఈడీ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సీటెట్ అర్హత సాధించి ఉండాలి.ఆర్ట్, పీఈటీ, లైబ్రేరియన్ పోస్టులకు గ్రాడ్యుయేషన్, డిప్లొమా (లైబ్రరీ సైన్స్), బీపీఈడీ, డిప్లొమా (ఫైన్ ఆర్ట్స్), బ్యాచిలర్స్ డిగ్రీ (మ్యూజిక్) ఉత్తీర్ణతతోపాటు అనుభవం ఉండాలి అని వివరాలను వెల్లడించారు. దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు పూర్తి వివరాలకు https://navodaya.gov.in/ వెబ్సైట్ను సందర్శించాలని కోరారు.