Good news..Registration 4 times a year from now
mictv telugu

ఇక నుంచి ఏడాదికి 4 సార్లు నమోదు

August 19, 2022

తెలంగాణ రాష్ట్రంలో 18 ఏండ్లు నిండిన యువతి, యువకులకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్‌ రాజ్‌ గుడ్‌న్యూస్ చెప్పారు. ఇక నుంచి ప్రతి ఏడాదిలో నాలుగుసార్లు ఓటర్‌గా నమోదు చేసుకోవడానికి, 18 ఏండ్లు నిండిన ప్రతి వారికి అవకాశం కల్పిస్తున్నామని తెలియజేస్తూ, గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.

బుద్ధభవన్‌లోని సీఈవో కార్యాలయంలో గురువారం ఆయన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితా, ఓటర్‌ కార్డులు-ఆధార్‌ అనుసంధానంపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజీపీ, సీపీఐ, సీపీఎం, ఎంఐఎం, టీడీపీ, బీఎస్పీ ప్రతినిధులు హాజరయ్యారు.

వికాస్‌రాజ్‌ మాట్లాడుతూ..”జనవరి 1, ఏప్రిల్‌ 1, జూలై 1, అక్టోబర్‌ 1న ఓటరుగా నమోదు చేసుకోవటానికి అవకాశం కల్పించాం. ఆయా తేదీల నాటికి 18 ఏండ్లు నిండినవాళ్లు ఓటు కోసం నమోదు చేసుకోవచ్చు. ఓటరు కార్డుల డూప్లికేషన్‌ లేకుండా ఆధార్‌ అనుసంధానాన్ని తీసుకొచ్చాం. అలాగే నవంబర్‌లో విడుదల చేసే స్పెషల్‌ సమ్మర్‌ రివిజన్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌) ఏ విధంగా చేపడుతున్నాము అనే దానిపై చర్చించాము”అని ఆయన అన్నారు.

ఇక, ఓటు విషయానికొస్తే.. ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరగాలంటే, దాదాపు ఎన్నికల తతంగం ఒక నెల కాలం పాటు జరుగుతుంది. అవసరమైతే ఇంకొన్నాళ్ళు పట్టొచ్చు. ఓటర్ల నమోదు కార్యక్రమం, ఓటర్ల జాబితా తయారీ, ఓటర్ల జాబితా సవరణలు, క్లెయిములు వగైరా సాధారణ కార్యక్రమాలు జరుగుతాయి. భారత రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు అయినటువంటి ఓటు హక్కు, 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారత పౌరుడు కలిగి వుంటాడు. ఓటర్ల జాబితాలో తమ పేర్లను చేర్చుట, ఓటు హక్కు పొందుట ప్రతి భారత పౌరుని హక్కు, విధి. సాధారణంగా, ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభంనకు ఓ వారం రోజుల ముందు నుంచే కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం ప్రారంభం అవుతుంది. కానీ, తెలంగాణలో ఇక నుంచి ఏడాదికి నాలుగుసార్లు ఓటర్ నమోదు చేయడానికి ఎన్నికల కమీషన్ సిద్దమైంది.