గుడ్‌న్యూస్: రూ.750కే గ్యాస్ సిలిండర్..ప్రాసెస్ ఇదే
రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య మొదలైన యుద్ధం కారణంగా కొన్ని నెలలపాటు నిత్యావసరాల వస్తువులు మొదలుకొని పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. దాంతో దేశంలోని సామాన్య ప్రజలు నానా అవస్థలు పడ్డారు. పెరిగిన ధరలను చూసి బెంబేలెత్తిపోయిన ఆయా రాష్ట్రాల ప్రజలు..వెంటనే ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ, ధర్నాలు, నిరసనలు చేశారు. దాంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రజల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను స్వల్పంగా తగ్గిస్తూ, ఆదేశాలు జారీ చేసింది.
అయినా, దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో వంటింటి గ్యాస్ ధరలు మండిపోతున్నాయి. ఈ క్రమంలో వంటింటి మహిళలకు, కొత్త గ్యాస్ కనెక్షన్‌ని పొందాలని ప్లాన్ చేస్తుకున్నవారికి..ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు సంస్థ అయిన ఇండేన్ శుభవార్తను చెప్పింది. తన వినియోగదారుల కోసం ఓ ఆకర్షణీయమైన ఆఫర్‌తో ముందుకు వచ్చింది. రూ.750కే సిలిండర్‌ను అందజేస్తున్నామని పేర్కొంది. "ఎక్కువ డబ్బులు అవుతున్నాయని చింతిస్తున్నారా?, ఇక ఆ చింత ఆవసరం లేదు. కేవలం రూ.750కే గ్యాస్ సిలిండర్ లభించబోతోంది. మీరు ఇప్పటి వరకు చెల్లిస్తున్న సాధారణ సిలిండర్ ధర కంటే రూ. 300 తక్కువకు లభిస్తుంది" అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఆ ప్రకటనలో.."ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ. వెయ్యికి పైగానే ఉంది. ఇలాంటి సమయంలో Indane కంపెనీ సామాన్యులను దృష్టిలో ఉంచుకొని, కొత్త ప్లాన్‌తో ముందుకొచ్చింది. కేవలం 750 రూపాయలకే గ్యాస్ సిలిండర్‌ను పొందవచ్చు. ఇందులో 10 కిలోల గ్యాస్ లభిస్తుంది. ఈ సిలిండర్ బరువు సాధారణ సిలిండర్ కంటే తక్కువగా ఉంటుంది. అందుకే దాని ధర కూడా తక్కువే. దీన్ని సులభంగా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తీసుకెళ్లవచ్చు. ప్రస్తుతం ఈ సదుపాయం 28 నగరాల్లో మాత్రమే ఉంది. అతి త్వరలోనే అన్ని నగరాల్లో ఈ సిలిండర్ అందుబాటులోకి రానుంది. అయితే, ఈ సిలిండర్‌ను పొందాలి అనుకునేవారు..పేటీఎం, ఫోన్‌పే, యాపీఐ యాప్‌లు ద్వారా సిలిండర్‌ను బుకింగ్ చేసుకోవాలి. అలా బుక్ చేసుకున్న వారికి మంచి డిస్కౌంట్లు లభిస్తాయి" అని పేర్కొంది.