Good news..seatet notification release..another chance for them
mictv telugu

గుడ్‌న్యూస్..సీటెట్ నోటిఫికేషన్ విడుదల..వారికి మరో ఛాన్స్

July 16, 2022

రెండు తెలుగు రాష్ట్రాల్లో సీటెట్ (సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న విద్యార్దినీ, విద్యార్థులకు సీబీఎస్ఈ గుడ్‌న్యూస్ చెప్పింది. 2022 సంవత్సరానికి సంబంధించిన సీటెట్ నోటిఫికేషన్‌ను శనివారం అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్షను సీబీటీ (కంప్యూటర్ బేసీడ్ టెస్ట్) విధానంలో నిర్వహిస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ పరీక్ష 20 భాషల్లో నిర్వహించబడుతుందని అధికారులు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. సీటెట్‌కు దరఖాస్తులు చేసేందుకు అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ctet.nic.in ని సందర్శించాలని కోరారు.

అయితే, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్..ఈ సీటెట్ పరీక్షకు సంబంధించి కచ్చితమైన తేదీని మాత్రం ప్రకటించలేదు. కానీ, డిసెంబర్ 2022లోనే ఈ పరీక్షను నిర్వహిస్తామని స్పష్టం చేసింది. వాస్తవానికి పరీక్షకు 3 నెలల ముందు నోటిఫికేషన్ జారీ చేయబడుతుంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూలైలో ప్రారంభమైతే నవంబర్‌లో పరీక్ష నిర్వహించాలి. కానీ, నిన్న విడుదల చేసిన నోటీఫికేషన్‌లో మాత్రం డిసెంబర్‌లోనే పరీక్షను నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

”సీటెట్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే.. జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు పేపర్ 1, పేపర్ 2కు రూ. 1000 , ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 500 ఫీజు చెల్లించాలి. రెండు పేపర్లకు దరఖాస్తు చేసుకోవాలని అనుకుంటే, జనరల్ అండ్ ఓబీసీ అభ్యర్థులు రూ. 1200, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ. 600 చెల్లించాల్సి ఉంటుంది.” అని నోటిఫికేషన్‌లో పేర్కొంది.

ఇక, తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే జరిగిన స్టేట్ టెట్ పరీక్షలో అర్హత సాధించలేని అభ్యర్థులకు ఈ సీటెట్ మరో అవకాశాన్ని కల్పించబోతుంది. అంటే.. తెలంగాణ టెట్‌లో ఫెయిల్ అయిన ఈ సీటెట్‌లో అభ్యర్థులు అర్హత సాధిస్తే, తెలంగాణలో నిర్వహించబోయే డీఎస్సీ పరీక్షకు అర్హులు అవుతారు. కాబట్టి టెట్ పరీక్షలో ఫెయిల్ అయిన అభ్యర్థులు నిరాశ చెందకుంగా ఈ సీటెట్‌కు దరఖాస్తులు చేసుకొని, పరీక్షలో అర్హత సాధించాలని నిపుణులు కోరారు. ఈ పరీక్ష ఎలా ఉంటుంది? ఓసీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్లకి ఎన్ని మార్కులు వస్తే అర్హత సాధిస్తాము? దరఖాస్తుల చివరి తేదీ ఎప్పుడు? అనే తదితర పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో పేర్కొనబడ్డాయి. అభ్యర్థులు నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.