గుడ్‌న్యూస్.. 2,679 కోట్లతో సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రులు - MicTv.in - Telugu News
mictv telugu

గుడ్‌న్యూస్.. 2,679 కోట్లతో సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రులు

April 21, 2022

kkk

తెలంగాణ ప్రజలకు కేసీఆర్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నగరం నాలుగు దిక్కుల్లో 2,679 కోట్లతో సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రులను నిర్మించడానికి వైద్య ఆరోగ్య శాఖ శ్రీకారం చుట్టింది. ఈ ఆసుప్రతులను ఎల్బీనగర్, సనత్ నగర్, అల్వాల్, గచ్చిబౌలిలో నిర్మించనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన జీవోను గురువారం వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసింది.

తెలంగాణ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఈ సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రులను నిర్మించడానికి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఎల్బీనగర్, అల్వాల్, సనత్ నగర్‌లలో 2,679 కోట్లతో ఆస్పత్రుల నిర్మాణం చేసేందుకు పరిపాలన పరమైన ఉత్తర్వులను జారీ చేసింది.

అంతేకాకుండా, 900కోట్లతో ఎల్బీనగర్, 882 కోట్లతో సనత్ నగర్, 897 కోట్లతో అల్వాల్ ఆసుపత్రులను నిర్మించేందుకు నిధులు కేటాయిస్తున్నట్లు జీవో ఎం. ఎస్ .41లో పేర్కొంది. ఇప్పటికే గచ్చిబౌలిలో తెలంగాణ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరుతో ఆస్పత్రిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

ఇప్పుడు ఎల్బీనగర్, అల్వాల్, సనత్ నగర్‌లలోను సూపర్ స్పేషాల్టీ ఆసుపత్రులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఆసుపత్రుల నిర్మాణం కోసం టెండర్లు పిలవాలని ఆర్ అండ్ బీ శాఖను ఆదేశిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని టీఎస్ఎంఎస్ ఐడీసీని, డీఎంఈలకు వైద్య ఆరోగ్య శాఖ ఆదేశించింది. ఈ ఆసుపత్రులకు స్వయంప్రతిపత్తి హోదా కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.