తమ వ్యాపారాలు సక్సెస్ అవడం కోసం యజమానులు కొత్తకొత్తగా ఆలోచిస్తున్నారు. మార్కెట్లో ప్రాచుర్యం పొందేందుకు పేర్లు పెట్టడం మొదలు, వసతులు, సౌకర్యాలు కల్పించడంలో తమ మార్కు చూపిస్తున్నారు. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఏదో ఒక కొత్తదనం ఉండేలా చూసుకుంటున్నారు. తద్వారా తొందరగా వ్యాపారాన్ని పెంచుకోవాలని తాపత్రయపడుతున్నారు. ఈ కోవలోకి వచ్చేదే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జైలు హోటల్ కం రెస్టారెంటు. సంతోష్ అనే వ్యక్తి ‘జైలు మండి’ పేరుతో ఓ రెస్టారెంటును ప్రారంభించాడు.
పేరుకు తగ్గట్టుగానే జైలులో ఉండే తుపాకీలు, బేడీలు, ఊచలు వంటివి ఏర్పాటు చేశాడు. ఫుడ్ సర్వ్ చేసే వారు ఖైదీల డ్రెస్సులు వేసుకుంటారు. బిల్లు తీసుకునే వ్యక్తి జైలర్ యూనిఫార్మ్‌లో ఉంటాడు. జైలుకు కాపలా ఉన్నట్టుగా రెస్టారెంటు బయట ఓ వ్యక్తి బొమ్మ తుపాకీతో కస్టమర్లను ఆహ్వానిస్తుంటాడు. మొత్తానికి హొటల్కి వచ్చే వ్యక్తికి జైలు వాతావరణాన్ని ప్రత్యక్షంగా చూపిస్తాడు. అయితే జైలులో ఉండే ఆహారం మాత్రం ఉండదు. రుచికరమైన బిర్యానీలు, చికెన్ వెరైటీలు వంటివి అందుబాటులో ఉంటాయి. దీంతో ఫ్యామిలీతో వచ్చే వాళ్లను ఈ రెస్టారెంటు ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా చిన్న పిల్లలు బొమ్మ తుపాకీలతో ఆడుకుంటూ వాటితో సెల్ఫీలు దిగుతున్నారు. దీంతో అనుకున్నట్టుగానే కొద్ది కాలంలోనే తమ రెస్టారెంటు పాపులర్ అయ్యిందని సంతోష్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇంకా చాలా ఎక్కువ మందికి తెలిసి భవిష్యత్తులో తమ బిజినెస్ ఇంకా పెరుగుతుందని ఆయన నమ్మకం వెలిబుచ్చారు.