Good news..those colleges are coming again..
mictv telugu

గుడ్‌న్యూస్..మళ్లీ ఆ కాలేజీలు వచ్చేస్తున్నాయ్..

August 15, 2022

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఉన్న జేఎన్టీయూ అధికారులు ఓ గుడ్‌న్యూస్ చెప్పారు. 1990కి పూర్వం ఎంతో ప్రాచుర్యం పొందిన ఈవినింగ్ కాలేజీ (సాయంత్రం స్పెషల్ క్లాసులు) విధానాన్ని మళ్లీ తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. అప్పట్లో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూనే, అనేక మంది ఈవినింగ్ కాలేజీల్లో చదువుకొనేవారు. కాలక్రమంలో ఈవినింగ్ కాలేజీలన్నీ రెగ్యులర్ కాలేజీలుగా మారిపోయాయి. మళ్లీ ఈవినింగ్ కాలేజీలను నడిపేందుకు జేఎన్టీయూ సిద్దమైందని అధికారులు వివరించారు.

అయితే, ఈ ఈవినింగ్ కాలేజీలో ఏ కోర్సులు పెట్టాలి? అనే దానిపై తాజాగా ఓ సమావేశం నిర్వహించి చర్చలు జరిపారు. ఆ చర్చల్లో భాగంగా బీబీఏ డాటా అనలిటిక్స్ కోర్సును ఈవినింగ్ కోర్సుగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ విద్యా సంవత్సరం నుంచే జేఎన్టీయూలో డబుల్ డిగ్రీ కోర్సుగా ఈ బీబీఏ డాటా అనలిటిక్స్ కోర్సును ప్రవేశపెట్టారు. ఇంజినీరింగ్ విద్యార్థులు నాలుగేండ్ల బీటెక్ కోర్సును చదువుతూనే.. మరోవైపు మూడేండ్ల బీబీఏ డాటా అనలిటిక్స్ కోర్సు చేయవచ్చని తెలిపారు. అయితే, ఇంజినీరింగ్ కోర్సుతో పాటు బీబీఏ డాటా అనలిటిక్స్ కోర్సు ఒకే కాలేజీలో ఉంటేనే విద్యార్థులకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి వీలుంటుందని సూచించారు.

ఇక, ఈ బీబీఏ కోర్సు విషయానికొస్తే.. ”మొత్తం కాల వ్యవధిలో 60% ఆన్లైన్లో, 40% ఆప్‌లైన్‌లో చదువుకోవచ్చు. విద్యార్థి ఏ కాలేజీలో చేరితే, ఆ కాలేజీలోనే రెండు కోర్సులకు సంబంధించిన ల్యాబ్ వర్క్, ప్రాక్టికల్స్, ఇంటర్నల్స్‌ను పూర్తిచేయాలి. ఒకవేళ కోర్సును పూర్తిచేయడం వీలు కాని పక్షంలో సంబంధిత క్రెడిట్‌ను మరో కోర్సుకు బదలాయించుకోవచ్చు. ఈవినింగ్ క్లాసులను ఆన్లైన్లో నిర్వహించాలా? ఆన్లైన్లో నిర్వహించాలా? అన్న అంశంపై త్వరలోనే స్పష్టత వస్తుంది. జేఎన్టీయూ అనుబంధ గుర్తింపు కోసం ఈ ఏడాది 148 ఇంజినీరింగ్ కాలేజీలు దరఖాస్తు చేశాయి” అని ఓ ఉన్నతాధికారి తెలిపారు.

Good news..those colleges are coming again..